Begin typing your search above and press return to search.

గృహ రుణాలపై జగన్ సర్కార్ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

By:  Tupaki Desk   |   17 Sep 2021 1:30 PM GMT
గృహ రుణాలపై జగన్ సర్కార్ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌
X
జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 46.61 లక్షల మందికి పైగా పేదలు లబ్ది పొందబోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకంటూ సొంత ఆస్తిని అందుకోబోతున్నారు. ఏపీ రావాల్సిన మొండి బకాయిలు, కేంద్రం నిధులు, ఇతరత్రా నిధులపై సీఎం దృష్టిసారిస్తున్నారు. ఇటీవల కేంద్రం నుంచి వరుసబెట్టి నిధులను తెప్పించుకోవడంలో జగన్ సర్కారు విజయవంతమైంది. ఇక తాజాగా ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా గతంలో ఇంటి కోసం తీసుకున్న లబ్ధిదారుల రుణాలను మూడులక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఏపీ క్యాబినెట్ దీనికి భిన్నంగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలోనే కాదు, ఎన్టీఆర్ కాలం నుంచి ఇళ్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకొని వారి ఆస్తులను వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నారు. వీరినే ప్రభుత్వ హక్కుదారులుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు తెలుస్తోంది.

ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ ను గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలుగా, మున్సిపాల్టీల్లో రూ.15వేలుగా, నగరపాలక సంస్థల పరిధిలో రూ.20వేలుగా నిర్ణయించారు. నిర్ణీత మొత్తాల్ని డిసెంబర్ 30లోగా చెల్లిస్తే, ప్రస్తుతం ఉంటున్న ప్రభుత్వ ఇల్లు లేదా అనుభవిస్తున్న ప్రభుత్వ స్థలాన్ని తమ పేరిట ప్రైవేటు ఆస్తిగా లబ్దిదారులు మార్చుకోవచ్చు. ప్రభుత్వం నుంచి స్థలం పొంది, సొంత డబ్బుతో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు ఎలాంటి వన్ టైమ్ సెటిల్ మెంట్ ఉండదు. వాళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా, ఆ ఇంటిని వ్యక్తిగత ఆస్తిగా మార్చి పేదలను ధనవంతుల్ని చేస్తానని గతంలోనే సీఎం జగన్ మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని అమలు చేసే దిశగా తీర్మానం చేశారు.

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇళ్లు కుదువపెట్టిన వారి కోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు. 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందిన పేదలు రుణం కోసం హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర తనఖా పెట్టి తీసుకున్న అప్పు అసలు రూ.9,320 కోట్లు కాగా, దానికి ఇప్పటివరకు వడ్డీ రూ.5,289 కోట్లు అని వివరించారు. ఈ రుణాన్ని వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరించి పేదలకు లబ్ది చేకూర్చాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో రూ.20వేలు చెల్లించాల్సి ఉందన్నారు.

మొత్తంగా 47లక్షల మంది పేదలు రుణాలు కట్టాల్సి ఉంది. వీరిలో 4.57లక్షల మంది పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది పథకంలో డబ్బులు కట్టినా రూ.5వేల కోట్లు మూడు నెలల్లోనే సర్కారు ఖజానాకు జమ కానున్నాయి. మరోవైపు ఈ నిర్ణయం అమల్లో వచ్చే సమస్యలపైన ప్రభుత్వం చర్చిస్తుంది. కాగా కొనుగోలు చేసిన వారికి ఈ ఇల్లు తప్ప మరేవీ ఉండకూడదంటూ ప్రభుత్వం షరతు విధించడం గమనార్హం. మరోవైపు జగన్ సర్కారు నవరత్నాల్లో భాగంగా 30లక్షల పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మిస్తోంది.