Begin typing your search above and press return to search.

రివర్స్ టెండరింగ్.. జగన్ సర్కారు తాజా ఆదా రూ.33 కోట్లు

By:  Tupaki Desk   |   10 Nov 2019 8:35 AM GMT
రివర్స్ టెండరింగ్.. జగన్ సర్కారు తాజా ఆదా రూ.33 కోట్లు
X
ప్రజాధనాన్ని పప్పుబెల్లాల లెక్కన పంచేసే తీరుకు పుల్ స్టాప్ పెడుతూ.. రివర్స్ టెండరింగ్ విధానంతో ఆదా చేసే ధోరణికి తెర తీసింది ఏపీలోని జగన్ సర్కారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా అమలు చేయటం ద్వారా దాదాపు రూ.838 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం.. తాజాగా రూ.33 కోట్ల మొత్తాన్ని సేవ్ చేసింది.

జగన్ ప్రభుత్వంలో కొత్తగా నియమించిన గ్రామ.. వార్డు సచివాలయ సిబ్బందికి 4జీ సిమ్ ను ఇవ్వటమే కాదు.. వారికి నెలవారీ ప్లాన్ ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రివర్స్ టెండరింగ్ తో కోట్లాది రూపాయిల్ని ఏపీ ఖజానకు మేలు కలిగేలా వ్యవహరించింది ఏపీ సర్కార్.

గ్రామ సచివాలయాల్లో పని చేసే సిబ్బందికి 4జీ సిమ్ తో పాటు నెలవారీ ప్యాక్ ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2,64,920 సిమ్ లు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీన్లో ఎల్ 1గా నిలిచిన ఎయిర్ టెల్ బహిరంగ మార్కెట్లో రూ.199 అమ్మే ప్యాక్ ను ఏపీ ప్రభుత్వానికి మాత్రం రూ.92 ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రివర్స్ టెండరింగ్ తోనే ఇది సాధ్యమైంది.

మూడేళ్ల కాలానికి రూ.121.54 కోట్ల కనీస బిడ్ గా నిర్ణయిస్తూ ఏపీ టెక్నాలజీస్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి స్పందించిన ఎయిర్ టెల్ మార్కెట్ ధర కంటే భారీగా తగ్గిస్తే ఒక్కో సిమ్ మీద రూ.107 తగ్గిస్తూ సర్వీసు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ నేషనల్.. లోకల్ కాల్స్ తో పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ లు కూడా ఉంటాయి. అంతేకాదు ఒక జీవీ ఉచిత 4జీ డేటా కూడా ఇవ్వనున్నారు. తాజా రివర్స్ టెండరింగ్ కారణంగా రూ.33.76 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. మాటల్లోనే ఆదా కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్న జగన్ సర్కారు తీరు విపక్షాలకు ఒక పట్టాన మింగుడుపడటం లేదని చెప్పక తప్పదు.