Begin typing your search above and press return to search.

వాట్టే టైమింగ్: జగన్ గ్రోత్.. సోనియా పతనం!

By:  Tupaki Desk   |   30 May 2019 5:21 PM GMT
వాట్టే టైమింగ్: జగన్ గ్రోత్.. సోనియా పతనం!
X
రసవత్తర రాజకీయంలో కూడా టైమింగ్ ఉంటుంది! ఇది వరకూ ఎన్నో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా సాగాయి! ఓడలు బళ్లు అయ్యాయి - బళ్లు ఓడలయ్యాయి! రాజకీయ చరిత్రలో అలాంటి రసవత్తర సన్నివేశాలెన్నో! బహుశా ఇది కూడా అదే కోవకే చెందుతుంది కాబోలు!

దాదాపు తొమ్మిదేళ్ల కిందట జగన్ మోహన్ రెడ్డి సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. తను చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతిని కోరాడానికి. అప్పటికే జగన్ ఓదార్పు యాత్రను మొదలుపెట్టేశారు. అది సాఫీగానే సాగుతూ వచ్చింది. జగన్ జనం మధ్యకు వెళ్లే సరికి - అక్కడ బ్రహ్మాండమైన ఆదరణ కనిపించే సరికి కాంగ్రెస్ పార్టీలోని కొందరికి కన్నుకుట్టింది!

వెంటనే సోనియాగాంధీ వద్దకు వెళ్లారు. అలాంటి వృద్ధ జంబూకాళ్లాంటి నేతలకే అప్పుడు సోనియా ప్రాధాన్యతను ఇచ్చింది. వెంటనే జగన్ ను ఢిల్లీకి పిలిపించడం - 'ఓదార్పు'ను ఆపాలంటూ స్ట్రిక్ట్ గా చెప్పడం చకచకా జరిగిపోయింది. సోనియాను కన్వీన్స్ చేసేందుకు జగన్ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది!

ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆయన యథాతథంగా ఓదార్పు యాత్రను కొనసాగించడం - కాంగ్రెస్ ద్వారా తనకూ - తన తల్లికి దక్కిన పదవులకు రాజీనామా చేయడం - సొంతం పోటీ చేయడం - భారీ మెజారిటీతో నెగ్గడం.. చకచకా జరిగిపోయాయి.

అదంతా ప్రజాభీష్టం మేరకు జరిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం ఆ పరిణామాలు ఏవీ ఇష్టం లేదు. అందుకే జగన్ కు కేసులను తగిలించారు. పదహారు నెలల పాటు జైల్లో పెట్టారు. అవినీతి పరుడు అనే ముద్రను వేశారు. జగన్ అవినీతి పరుడు అయితే అప్పటి కాంగ్రెస్ కేబినెట్ లోని సగం మంది మంత్రులు జైల్లో ఉండాలి. అయితే అప్పుడు సోనియాకు - పవర్ చేతిలో పెట్టుకున్న కాంగ్రెస్ కు కావాల్సింది న్యాయం కాదు. తమను ఎదురించిన జగన్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా అప్పటి రాజకీయం నడిచింది!

జగన్ మీద కోపంతో - జగన్ ఏపీలో బలపడితే తమకు భవిష్యత్తుల్లో ఇబ్బంది ఎదురువుతుందనే లెక్కలతోనే కాంగ్రెస్ హై కమాండ్ ఉమ్మడి ఏపీని కూడా విడదీసిందనేది ఒక విశ్లేషణ. ఎట్టకేలకూ ఎన్నికల సమయానికి జగన్ కు బెయిల్ వచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు కలిసి జగన్ పై ‘అవినీతి’ ముద్రను బలంగా వేశాయి. అయినా స్వల్ప మెజారిటీతోనే జగన్ వెనుకబడిపోయారు.

ఆ ఎన్నికల్లో జరిగిన మరో చిత్రం కాంగ్రెస్ పార్టీ పతనం! దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ చిత్తు అయ్యింది. జగన్ కూడా ఓడారు కానీ, పోరాడేంత శక్తి అయితే జగన్ లో ఉండింది. పోరాడారు. గట్టిగా తిరిగారు. ప్రజల మధ్యనే గడిపారు. అలా ఐదేళ్లు గడిచాయి. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యారు! ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే..ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది!

ఐదేళ్ల వ్యవధిలో జగన్ కోలుకోవడమే కాదు, సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎప్పటికి కోలుకోవాలి? అంటే దానికి సమాధానం లేదు! ఇప్పుడే కాదు ఇంకో ఐదేళ్లకు అయినా కాంగ్రెస్ కోలుకుంటుందా? అంటే ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్పడానికీ ఎవరికీ ధైర్యం లేదు. రాహుల్ గాంధీనే ఓడిపోతే.. ఓడిపోయినా అతడే దిక్కు అని కాంగ్రెస్ వాళ్లు అంటుంటే, ఆ పార్టీ భవిష్యత్తులో కోలుకుంటుందని ఎవరైనా అంచచనా వేయగలరా? జగన్ ను అప్పుడు దెబ్బ తీసిన సోనియా ఇప్పుడు పార్టీని ఎలా నడపాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే.. జగన్ మోహన్ రెడ్డి తిరుగులేని ప్రజాతీర్పుతో తన అభీష్టాన్ని నెరవేర్చుకున్నారు! ఎంత తేడా!