Begin typing your search above and press return to search.

జగన్ మారారు...పులివెందుల టాక్

By:  Tupaki Desk   |   4 Sep 2022 1:30 AM GMT
జగన్ మారారు...పులివెందుల టాక్
X
వైఎస్సార్ ఫ్యామిలీ గురించి అంతా తెలిసిన నేల అది. బయట జనాలకు వారు అధినాయకులు అయితే వారికి ప్రజా ప్రతినిధులు. అర్ధ శతాబ్దంగా పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకే కట్టుబడిపోయింది. మాకు పార్టీలు రాజకీయాలు ముఖ్యం కాదు వైఎస్ కుటుంబమే ముఖ్యం అంటూ వారి వెంట నడిచింది. కష్టాల్లో తల్లిలా ఆదుకుంది. వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే ఆశీర్వదించింది.

పులివెందుల అంటే వైఎస్సార్ ముందు గుర్తుకు వస్తారు. తరువాత ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి, అలాగే వైఎస్ విజయమ్మ, ఇపుడు వైఎస్ జగన్ ఇలా వరసబెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. వైఎస్సార్ ఆరు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేస్తే వివేకానందరెడ్డి రెండు సార్లు చేశారు. విజయమ్మ ఒకసారి గెలిస్తే గత రెండు సార్లుగా జగన్ ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ అక్కడ నుంచే పోటీ చేస్తారు. ఇది సహజమైన విషయమే.

ఇదిలా ఉంటే మూడు రోజుల పర్యటన నిమిత్తం సొంత జిల్లా కడపకు వెళ్ళిన జగన్ ఈసారి పూర్తిగా కొత్తగా జనాలకు కనిపించారు అని పులువెందుల టాక్. ఆయన తన నియోజకవర్గంలోని వేముల మండలం వేంపల్లెలో సచివాలయ సముదాయాన్ని ప్రారంభించారు. అంతే కాదు అక్కడ సర్పంచ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుకున్నారు. పక్కన సర్పంచ్ నిర్మలతో కలసి ఫోటో దిగారు. అలా చాలా సాదాసీదాగా కలసిపోయారు.

ఇక ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ కి నివాళి అర్పించిన తరువాత ఆయన దారిపొడవున్నా నడుస్తూ ఆగుతూ చాలా మంది జనాలతో ముచ్చటించారు. ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బందులు పెట్టవద్దు ఎవరు వస్తే వారిని తన వద్దకు పంపించాలని ఆయన ముందే చెప్పి ఉండడం వల్ల పులువెందుల జనం చాలా మంది జగన్ తో నేరుగా మాట్లాడారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. జగన్ సైతం ప్రతీ వారితోనూ ఓపికగా మాట్లాడడమే కాకుండా వారు చెప్పిన సమస్యలు కూడా సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సత్వరమే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం కనిపించింది.

ఇక పులివెందుల అభివృద్ధి మీద సమీక్ష నిర్వహించి మరీ స్థానిక సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధికారులతో కోరడం జరిగింది. ఎవరూ అసంతృప్తిగా ఉండవద్దని జగన్ పార్టీ నాయకులను కోరడం విశేషం. నేనున్నాను అని ఆయన గట్టి భరోసా ఇచ్చారు. ఇక జగన్ ఈసారి ఇలా అందరితో కలసిపోయి సమస్యల మీద పూర్తి దృష్టి పెట్టడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు.

పులివెందులలో జగన్ కి వ్యతిరేకత పెరిగింది అని టీడీపీ అంటోంది. గతంలా కాదు ఈసారి జగన్నే ఓడిస్తామని చెబుతోంది. దానికి తోడు వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని ప్రచారం జరగడంతో జనంలో కూడా కొంత చర్చకు ఆస్కారం ఏర్పడింది. అన్నింటికంటే ఎక్కువగా చెప్పాల్సింది వైఎస్ వివేకా హత్య తరువాత సీన్ మారింది. ఎవరు ఎమ్మెల్యే అయినా వివేకానే లోకల్ గా ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఆయనే అందుబాటులో ఉండేవారు అని జనాలు చెబుతారు. అలాంటి ఆయన దారుణ హత్యకు గురి కావడంతో పులివెందుల జనాలు షాక్ కి గురి అయ్యారని అంటారు. ఇక ఆ విషయం తరువాత చూస్తే పులివెందులలో జగన్ తరఫున నిలబడి ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటికి పరిష్కారం చూసే మెకానిజం అన్నది లేకుండా పోయింది. దాంతో కొంత ఇబ్బంది అయితే ఉంది. అంతమాత్రాన జగన్ ఓడిపోతారని కాదు కానీ గతంలో ఎనభై వేల పై చిలుకు మెజారిటీ జగన్ కి వచ్చింది. ఇపుడు దాన్ని బాగా తగ్గించాలని టీడీపీ చూస్తోంది.

ఈ నేపధ్యంలో జగన్ కూడా స్టైల్ మార్చారు అని అంటున్నారు. తాను ఉన్నాను అని పార్టీ నాయకులకు భరోసా ఇవ్వడమే కాకుండా జనాలను నేరుగా కలుసుకుని ముచ్చటించడం ద్వారా బాగా దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేశారు అని అంటున్నారు. దాంతో జగన్ మారారు అని పులివెందుల నుంచి టాక్ అయితే వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.