Begin typing your search above and press return to search.

జగన్ సర్వేల్లో నిలిచేదెవరు... ?

By:  Tupaki Desk   |   26 Oct 2021 4:30 PM GMT
జగన్ సర్వేల్లో నిలిచేదెవరు... ?
X
సర్వేలు ఇపుడు రాజకీయాల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ఒకరికి టికెట్ ఇవ్వాలంటే సర్వే. నామినేటెడ్ పదవి ఇవ్వాలంటే సర్వే. ఇక పార్టీలో కీలకమైన బాధ్యత అప్పచెప్పాలన్నా కూడా సర్వే. చివరికి మంత్రులుగా ఎవరుండాలి, ఎవరైతే బాగుంటుంది అన్న దాని మీద కూడా సర్వేలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సరిగ్గా డిసెంబర్ 8 నాటికి ప్రస్తుతం మంత్రివర్గానికి సగం కాలం పూర్తి అవుతుంది. ఎందుకంటే వీరంతా 2019 జూన్ 8న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కచ్చితంగా ముప్పయి నెలలే మీ పదవులు అని జగన్ ఆనాడే క్లారిటీగా చెప్పేశారు. దాంతో పాత మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైంది. రేసులో ఉన్న వారిలో ఆశలు మొలకెత్తుతున్నాయి.

ఇక విశాఖ జిల్లా నుంచి తీసుకుంటే చాలా మంది మంత్రి పదవుల కోసం చూస్తున్నారు. విశాఖ సిటీలో అయితే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనకు చాన్స్ దక్కకపోతుందా అన్న ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే ఆయన జనసేనాని పవన్ ని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఇక రూరల్ జిల్లాలో అయితే ముందుగా చెప్పుకోవాల్సింది అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. ఆయన మొదటి దఫాలోనే మినిస్టర్ ని అనుకున్నారు. కానీ అదిపుడు తప్పకుండా సాకారం అవుతుంది అని భావిస్తున్నారు. ఇక చోడవరం నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే తానే కొత్త మినిస్టర్ అంటూ ధీమాగా ఉన్నారు.

పాయకరావుపేట నుంచి మూడు సార్లు గెలిచిన గొల్ల బాబూరావు సైతం ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. నర్శీపట్నంలో మాజీ మంత్రి అయ్యనంపాత్రుడిని పాతిక వేల ఓట్ల తేడతో ఓడించిన పెట్ల ఉమా శంకర్ కూడా రేసులో ఉన్నారని టాక్. ఇక రెండు సార్లు వైసీపీ తరఫున గెలిచి గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా దానికి లొంగకుండా జగన్ వైపు నిలిచినందుకు తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తారని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆశపడుతున్నారు. ఏజెన్సీలో తీసుకుంటే పాడేరు నుంచి ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి ఎస్టీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

రాజకీయాలలో కొత్త అయినా డైనమిక్ లీడర్ అనిపించుకున్న అరకు ఎమ్మెల్యే, విద్యాధికుడు, పూర్వాశ్రమంలో బ్యాంక్ ఎంప్లాయ్ కూడా అయిన చెట్టి ఫల్గుణ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 11 ఎమ్మెల్యే సీట్లను గెలిచింది. ఇందులో ఒకరిద్దరు తప్ప అందరూ తామే మంత్రులమని అంటున్నారు. దాంతో జగన్ ఇప్పటికే ఆశావహుల వివరాలతో ఒక సర్వే చేయించారని ప్రచారం సాగుతోంది. దీంట్లో వచ్చిన సమాచారం ఏంటి అన్నది సీక్రెట్ అయినా మంత్రి పదవికి గట్టి పోటీ మాత్రం గుడివాడకు, బూడి ముత్యాలనాయుడుకు మధ్యనే ఉందని అంటున్నారు. మరి జగన్ నిర్ణయాలు అనూహ్యం కాబట్టి అమాత్య కిరీటం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.