Begin typing your search above and press return to search.

మొహమాటంలేదు మార్చేయండి

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:54 AM GMT
మొహమాటంలేదు మార్చేయండి
X
రాజకీయ పార్టీలకు ఎన్నికలంటే ఎంత సందడి ఉంటుందో అంతే స్థాయిలో సవాళ్లూ ఉంటాయి. ఆ సవాళ్లు ఎదుర్కోవడం.. అందుకు స్పష్టతతో ముందుకెళ్లడమే నాయకుడి లక్ష్యం. ఎన్నికల్లో ఏ నేత ఎక్కడ పోటీ చేస్తే విజయావకాశాలుంటాయి.. ఎవరు గెలిచే అవకాశం ఉంది... పార్టీకి ఎవరు ఎలా ఉపయోగపడగలరన్నది పార్టీలు అంచనాలు వేసుకుంటాయి. అయితే, అది అమలు చేయడంపైనే పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అందుకే... వైసీపీ అధినేత జగన్ మొహమాటాలను పక్కనపెట్టి టిక్కెట్ల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల ఇంచార్జిలను జగన్ మార్చారు. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట ఇంచార్జిని - తూర్పుగోదావరి జిల్లాలో ముమ్ముడివరం ఇంచార్జిని.. విజయవాడలో వంగవీటి రాధాను మార్చారు. వీరిలో ముమ్మిడివరంలో తొలగింపునకు గురైన పితాని బాలకృష్ణ జనసేనలో చేరగా ఆయనకు పవన్ వెంటనే టిక్కెట్ ఇచ్చారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం చలించలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇక విజయవాడలోనూ వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించలేదు. ఆయన్ను మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేస్తే లాభమని జగన్ యోచిస్తున్నారు... దీనిపై రాధా అసంతృప్తిగా ఉన్నా కూడా జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

జగన్ ఎందుకింత కఠినంగా ఉన్నారంటే దానికి సమాధానం రానున్న ఎన్నికలు వైసిపికి ఎంతో కీలకం. ఎలాగైనా వైసిపి అధికారంలోకి రావాలని ఇటు జగన్ - పార్టీ నేతలు - కార్యకర్తలు - అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దీనికోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా జగన్ ఏమాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే సీటుపైన స్పష్టమైన నిర్ణయంతో జగన్ ముందుకు వెళుతున్నారని పార్టీ అగ్రనేతల నుండి సమాచారం. అందులో భాగంగానే రాజధానిలో పార్టీ ప్రక్షాళన దిశగా వంగవీటి రాధాను సెంట్రల్ సీటు నుండి తప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు కోసం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేతలు అర్ధం చేసుకుని త్యాగాలు చేయడానికి బాధపడకూడదు అని సూచిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. దీంతో టికెట్ తమదే అని ధీమాగా ఉన్న వారు ఇప్పుడు జాగ్రత్తపడుతున్నట్లు టాక్.