Begin typing your search above and press return to search.

ముందస్తు ఆలోచనలో జగన్.. సజ్జల మాటే నిదర్శనమా?

By:  Tupaki Desk   |   7 May 2022 5:45 AM GMT
ముందస్తు ఆలోచనలో జగన్.. సజ్జల మాటే నిదర్శనమా?
X
రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉండనే ఉంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అంటే నవంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక.. ఏపీ విషయానికి వస్తే దగ్గర దగ్గర రెండేళ్ల సమయం ఉంది. కానీ.. మారిన పరిస్థితుల్ని చూసినప్పుడు 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు కాకుండా.. ఎవరికి వారు తమ షెడ్యూల్ కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో రెండు తెలుగురాష్ట్రాల అధికారపక్షాలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనలకు బలం చేకూరేలా పార్టీ నేతల మాటలు ఉంటున్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది చివరి వరకు ఆగకుండా.. వచ్చే ఏడాది మొదట్లో కర్ణాటకతో పాటుమరికొన్ని రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఆలోచన లేదని చెప్పారు. అయితే.. ఆయన మాటల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. తనకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆలోచనకు వచ్చిన పక్షంలో ఆయన ముందస్తుగా ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీలో పరిస్థితి మరోలా ఉందంటున్నారు. రోజులు గడుస్తున్నకొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పుట్టెడు ఆర్థిక ఇబ్బందులు.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు.. అత్యాచారాలు సీఎం జగన్ బ్రాండ్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

ఎంత సంక్షేమ పథకాల్ని అమలు చేసినా.. కొన్నిఅంశాల విషయంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. షెడ్యూల్ ప్రకారం రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు వెళితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు చెబుతారు.

ఈ కారణంగానే షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు వెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు.. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఏడాది. రెండేళ్లలో ఎన్నికలకు పోబోతున్నామన్నారు. రెండేళ్లకు అన్న మాటను పెద్దగాపట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందే రెండేళ్ల తర్వాత.. అలాంటప్పుడు ప్రత్యేకంగా రెండేళ్లు అన్న మాటలో ఎలాంటి అర్థం లేదు. కానీ.. ఏడాదిలో అన్న మాటను మాత్రం అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కష్ట కాలంలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతం అయ్యాయని.. ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగిందని.. ఈ విషయాన్ని తాను పొగరుగా చెప్పట్లేదని.. వినయంగానే చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఫలితాలు సానుకూలంగా ఉన్న వేళ.. వారి ఓటు బ్యాంకులో చీలిక రాక ముందే.. ముందస్తుకు వెళితే.. తమకు సానుకూల ఫలితాలు వచ్చే వీలుందన్న వాదనను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే సజ్జల నోటి నుంచి తాజా వ్యాఖ్య వచ్చి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.