Begin typing your search above and press return to search.

కడప గడపలో జగన్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   3 Dec 2022 9:40 AM GMT
కడప గడపలో జగన్ ఇంటరెస్టింగ్ కామెంట్స్
X
జగన్ కడప జిల్లా వాసి. ఆయన పుట్టుక రాజకీయ ఎదుగుదల అన్నీ కడప నుంచే ఉన్నాయి. ఆయన మాత్రమేనా మూడు నాలురు తరాల నుంచి కడప అంటే వైఎస్సార్ ఫ్యామిలీగా చెప్పుకుంటారు. అలాంటి కడప జిల్లా టూర్లు జగన్ ఎన్నో సార్లు చేశారు. సీఎం గా ఇపుడు ఎక్కువ టూర్లు చేస్తున్నా గతంలో విపక్ష నేతగా ఆయన అనేక సార్లు కడపను సందర్శించారు.

అంతదాకా ఎందుకు జగన్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలని నిర్ణయినుకున్నపుడు తన ఎంపీ పదవికి రాజీనామ చేసిన వేళ కడప జిల్లావే ఆయన్ని ఆదుకుంది. ఆనాడు కడప జనాలకు మాటమాత్రంగానైనా జగన్ చెప్పారో ఏమో తెలియదు కానీ కడప ప్రజానీకం మాత్రం రాజన్న తనయుడిగా అక్కున చేర్చుకున్నారు. ఏకంగా అయిదున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీతో జగన్ని గెలిపించారు. అలా తన సొంత ఇమేజ్ తో జగన్ కడప ఎంపీగా రెండవసారి గెలిచి చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉంటే జగన్ తాజాగా రెండు రోజుల పాటు కడప టూర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. తాను కడప జిల్లా అభివృద్ధి పాటుపడతాను అని జగన్ తనను కలసిన వైసీపీ నేతలు హామీ ఇవ్వడం గమనార్హం. తనకూ తన కుటుంబానికి కడప బాగా సహకరిస్తోందని కూడా జగన్ చెప్పుకున్నారు.

అలాగే తన వెంట నడుస్తున్న వైసీపీ నేతలు అందరికీ జగన్ కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక కడపతో పాటు పులివెందుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను అని జగన్ అనడమూ విశేషంగానే చూస్తున్నారు. రెండు రోజుల టూర్ లో కడపకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకున్న జగన్ పదే పదే తాను పుట్టిన కడపను, ఆ గడపను తలచుకున్నారు.

దీని భావమేమి అని ఆంతా ఆలోచిస్తున్నారు. నిజానికి జగన్ తన సొంత గడ్డ గురించి ఎపుడూ ఇంతలా చెప్పినది లేదు అని కూడా గుర్తు చేసుకుంటున్నారు. దానికి కారణం జగన్ సొంత ఇలాకాలో ఇటీవల కాలంలో వస్తున్న రాజకీయ మార్పులే అని అంటున్నారు. ఎంత కంచుకోట అయినప్పటికీ కడప ఒకసారి వైఎస్సార్ కే ఝలక్ ఇచ్చేసింది.1996 ఎన్నికల వేళ కడప నుంచి ఎంపీగా వైఎస్సార్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన మెజారిటీ అయిదు వేలకు పడిపోయింది. ఒక విధంగా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఆ గెలుపు ఉందని నాడే అంతా అన్నారు.

ఆ తరువాత వైఎస్సార్ కూడా జాగ్రత్తపడడంతో మళ్లీ కడపలో అలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఇక జగన్ కి కూడా నిన్నటిదాకా కడప కంచుకోటగానే ఉంది. కానీ ఇపుడు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలిజలు అక్కడ తమ రాజకీయ వాటా తేల్చమంటున్నారు. అలాగే సొంత బాబాయి వివేకా దారుణ హత్య కేసులో వైఎస్సార్ ఫ్యామిలీ దాయాదీ కుటుంబం మీద సీబీఐ సహా అందరి వెళ్ళూ చూపిస్తున్నారు. ఆ కేసు విషయంలో జగన్ సర్కార్ మూడున్నరేళ్ళుగా సాధించలేకపోయింది అన్న ఆగ్రహం కడప మొత్తం ఉంది అంటున్నారు.

అదే విధంగా వివేకా అంటే కడప జనాలు చాలా మక్కువ కనబరుస్తారు. ఆయన అజాత్రశత్రువు. అలాంటి నేత దారుణంగా హత్యకు గురి కావడం కడప మొత్తం తట్టుకోలేకపోతోంది. ఆయన హత్య వెనక ఎవరున్నా వారిని వెలికి తీసి బయటపెట్టే పని వైసీపీ సర్కార్ చేసి ఉంటే నీరాజనాలు పలికేవారు అని అంటారు. కానీ ఎందువల్లనో వైసీపీ ఏలుబడిలో అది జరగకపోగా సొంత కుమార్తె సునీత తనకు ఏపీలో విచారణ మీద నమ్మకం లేదని చెప్పి కేసుని తెలంగాణాకు బదిలీ చేయించారు. ఇది మాయని మచ్చగా వైసీపీకి మారింది.

ఈ పరిణామాలు అన్నీ కలసి కడపలో ప్రత్యేకమైన వ్యతిరేకతను వైసీపీ మీద కలుగచేస్తున్నాయి అంటున్నారు. సర్వే నివేదికలలో అది కనిపిస్తోంది అని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు సైతం దూకుడుగా పులివెందులను మేమే ఈసారి గెలుస్తామని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో రెండు రోజుల పాటు సాగిన జగన్ కడప జిల్లా టూర్ లో ఆయన అందరికీ థాంక్స్ చెబుతూ కడప జిల్లాతో పాటు పులివెందుల అభివృద్ధి చేస్తామని గట్టిగా ప్రకటించారు అని అంటున్నారు.

మరి ఇది జగన్ ముందు చూపా లేక మారుతున్న పరిస్థితుల పట్ల అప్రమత్తతా లేక తన సొంత గడ్డ మీద మరింత మమకారమా. ఏది ఏమైనా ఇంత బాహాటంగా జగన్ తన సొంత గడ్డ మీద అభిమానాన్ని మునుపెన్నడూ చాటుకోలేదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.