Begin typing your search above and press return to search.

కృష్ణా జిల్లా వాసులు ఆశ్చ‌ర్య‌పోయే కామెంట్ చేసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:28 AM GMT
కృష్ణా జిల్లా వాసులు ఆశ్చ‌ర్య‌పోయే కామెంట్ చేసిన జ‌గ‌న్‌
X
మ‌రావ‌తి నుంచి ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కార‌ణంగా...కృష్ణా-గుంటూరు జిల్లాలోని ఓ సామాజిక‌వ‌ర్గ‌ వాసుల‌కు టార్గెట్ అయిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేసే క్ర‌మంలో చ‌ర్చ‌లో పాల్తొన్న ఈయ‌న ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ అని తెలిపారు. ``అమరావతి ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం చేయను. అసలు ఈ ప్రాంతంపై నాకేం కోపం లేదు. నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. కావాలనే పథకం ప్రకారం తనపై దుష్ప్రచారం చేస్తున్నారు.` అని క్లారిటీ ఇచ్చారు.

గుంటూరు - కృష్ణా జిల్లాలకు చెందిన ప్రజలంటే తమకు చిన్నచూపు లేదని జ‌గ‌న్ తెలిపారు. 13 జిల్లాలు తనకు ఒకటేనని ప్రత్యేకించి కృష్ణాజిల్లాతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని జ‌గ‌న్ తెలిపారు. తన మేనత్తది అదే జిల్లా అని కృష్ణాజిల్లాతో ఉన్న అనుబంధాన్ని సభలో సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. `మా కుటుంబానికి చెందిన రాజ్ - యువరాజ్ థియేటర్లు..40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఈ జిల్లాలో నివశిస్తోన్న ప్రతివారు నా వారే. టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు మాకు మద్దతిచ్చేవారు ఉన్నారు. అన్ని జిల్లాలు - కులాలు - మతాలు ప్రాంతాలు చల్లగా ఉండాలి. కమ్మ - కాపు - రెడ్డి - ఎస్సీ - ఎస్టీ - బీసీలు..అందరూ ఓట్లు వేస్తేనే 151 సీట్లు గెలిచాం.ప్రజలను మోసం చెయ్యలేను, అభివృద్ది చేసి చూపిస్తా`` అని జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ అమరావతి కట్టాలంటే ఇంకా లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాలని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లాలంటే అటు విజయవాడ, ఇటు గుంటూరు నుంచి 40 నుంచి 20 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని, మార్గమధ్యంలో కరకట్టల వద్ద రాకపోకలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్నింటిని దృష్టిలో ఉంచుకొని విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించామని జగన్‌ స్పష్టం చేశారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, మిగతా ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి వేదికగానే చట్టాలు చేస్తామని చెప్పారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.