Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ లెక్క‌ల‌తో చాప చెట్టేసిన బాబు స‌ర్కారు!

By:  Tupaki Desk   |   7 March 2017 10:42 AM GMT
జ‌గ‌న్ లెక్క‌ల‌తో చాప చెట్టేసిన బాబు స‌ర్కారు!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిలో మొద‌లైన‌ ఏపీ శాస‌నస‌భా స‌మావేశాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. నిన్న తొలి రోజు స‌మావేశాలు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో ముగియ‌గా... నేటి ఉద‌యం ప్రారంభ‌మైన రెండో రోజు స‌మావేశాల్లో చంద్ర‌బాబు స‌ర్కారు ఆత్మ ర‌క్ష‌ణలో ప‌డిపోయింది. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంధించిన ప్ర‌శ్న‌ల‌కు బాబు అండ్ కో నుంచి సూటిగా ఒక్క స‌మాధానం కూడా రాలేని ప‌రిస్థితి ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. విద్యార్థి ద‌శ‌లో సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ సాధార‌ణ డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా చేసిన‌ట్టు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆర్థిక ప‌రమైన అంశాల్లో వైఎస్ జ‌గ‌న్ కంటే కూడా చంద్ర‌బాబుకే ప‌రిజ్ఞానం ఎక్కువ‌గా ఉంటుంద‌ని మ‌న‌మంతా అనుకుంటాం.

ఎక‌నామిక్స్‌లో మాస్ట‌ర్స్ ప‌ట్టా సాధించిన చంద్రబాబు... ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌ను తాను ఏపీకి సీఎంగా కాకుండా సీఈఓగా అభివ‌ర్ణించుకున్న వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. అయితే నేటి స‌భ‌లో మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెప్పుకుంటున్న గ‌ణాంకాల‌నే ఆధారం చేసుకుని విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక చంద్ర‌బాబు అండ్ కో నానా తంటాలు ప‌డింది. జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డానికి త‌మ వ‌ద్ద ఆధారాలు ఏమీ లేని నేప‌థ్యంలో ఏకంగా.... ఓ ప‌క్క జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గానే... స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ స‌భ‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారంటే ప‌రిస్థితి ఇట్టే అర్థం కాక మాన‌దు.

అయినా ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి జ‌గ‌న్ చేసిన కీల‌క ఉప‌న్యాసం విష‌యానికి వస్తే... రాష్ట్ర జీఎస్‌ డీపీ - వృద్ధి రేటుకు మ‌ధ్య ఉన్న సంబంధం... ఈ రెండు ఒక‌దానితో మ‌రొక‌టి ఎలా పెరుగుతాయ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ సుస్ప‌ష్టం చేయ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కారు బిత్త‌ర‌పోయింద‌నే చెప్పాలి. 200-05 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2016-17 వ‌ర‌కు మొత్తం 13 ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ఈ రెండింటి లెక్క‌లు రాసుకుని మ‌రీ వ‌చ్చిన జ‌గ‌న్‌... వాటిని స‌భ‌లో చ‌దివి వినిపించారు. ఈ స‌మ‌యంలో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఎలా చెప్పాల‌న్న కోణంలో చంద్ర‌బాబు దిక్కులు చూసిన వైనం ఆస‌క్తి రేకెత్తించింది. జీఎస్‌ డీపీకి వృద్ధి రేటు దాదాపుగా రెట్టింపుగా ఉంటుంద‌ని, 2004-05 వ‌ర‌కు రాష్ట్రంలో ఏటా ఇదే ప‌రిస్థితి క‌నిపించిందని, అయితే చంద్ర‌బాబు స‌ర్కారు అధికారం చేప‌ట్టాక ప‌రిస్థితి పూర్తిగా రివ‌ర్సైంద‌ని జ‌గ‌న్ లెక్క‌లు చెప్పి మ‌రీ చూపించారు. జీఎస్‌ డీపీ కంటే వృద్ధి రేటు రెట్టింపుగా ఉండాల్సి ఉన్నా... చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టిన త‌ర్వాత జీఎస్‌ డీపీలో వృద్ధి రేటు స‌గం మేర కూడా లేక‌పోవడాన్ని జ‌గ‌న్ అంకెల‌తో చెప్పేశారు.

ఇక జ‌గ‌న్‌ కు మ‌రింత మేర స‌మ‌యం ఇస్తే.. ఇంకేం లెక్క‌లు చెబుతారోనన్న అనుమానంతో ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల లేచి... జ‌గ‌న్ త‌ప్పుడు లెక్క‌లు చెబుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారే త‌ప్పించి... ఆ గ‌ణాంకాలు ఎలా త‌ప్పో చెప్ప‌లేక‌పోయారు. అంతేకాకుండా జ‌గ‌న్‌కు ఆ వివ‌రాలు ఎక్క‌డ దొరికాయో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని చెప్పిన య‌న‌మ‌ల‌... విప‌క్ష నేత ఆ లెక్క‌ల‌ను త‌మ‌కు ఇస్తే ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌తోనే జ‌గ‌న్ లెక్క‌ల‌కు త‌మ వ‌ద్ద స‌మాధానం లేద‌ని య‌న‌మ‌ల ఒప్పేసుకున్నార‌ని అర్థ‌మైపోయింది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ మ‌రిన్ని వివ‌రాలు చెప్ప‌బోగా... ప్ర‌భుత్వం నుంచి సంజ్ఞ‌లు అందుకున్న స్పీకర్.. ఓ ప‌క్క జ‌గ‌న్ ఇంకా మాట్లాడుతుండ‌గానే స‌భ‌ను వాయిదా వేసేసి వెళ్లిపోయారు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిలో మొదలైన అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజునే జ‌గ‌న్‌... అధికార ప‌క్షంపై పైచేయి సాధించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/