Begin typing your search above and press return to search.

జగన్ ఆగ్రహమైనా.. అనుగ్రహమైనా ఇంతే ఉంటుంది..

By:  Tupaki Desk   |   16 Nov 2021 12:30 PM GMT
జగన్ ఆగ్రహమైనా.. అనుగ్రహమైనా ఇంతే ఉంటుంది..
X
సీఎం కార్యాలయ అధికారులు.. సచివాలయం సెక్రటరీలు.. వివిధ విభాగాల హెడ్ లు.. జిల్లా అధికారం యంత్రాంగం అంతా ఒకటే హడావుడిలో ఉన్నారు.. పెద్ద పెద్ద అధికారులు సైతం మురుగు కాలువల వెంట పరుగులు తీస్తున్నారు.. రోజూ వారు అటుగా వెళ్తున్నప్పడు కనీసం ముఖం కూడా చూడని ప్రాంతాలకు, ముక్కు మూసుకుని వెళ్లే చోటకు పొలోమంటూ పోతున్నారు. ఓ పెద్ద సారయితే.. కిందకు వంగి మరీ మురుగు కాలువను పరిశీలించారు.
.. ఇదేదో ఒకే ఒక్కడు సినిమాలోని సీన్ అనుకునేరు. మన ఏపీలో జరిగిందే. ఈ రోజు ఉదయం నుంచి ఒకటే చర్చ రేపుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుగ్రహం ఎలా ఉంటుందో ఇంతకాలం చూసినవారు.. ఇప్పుడు ఆయన ఆగ్రహం ఎలా ఉందో చూశారు. దాంతోనే ఈ హడావుడి అంతా. జిల్లా స్థాయి అధికారి నుంచి సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వరకు అందరినీ కదిలించిన సంగతి ఏమంటే..

సీఎం జగన్ గత శని, ఆదివారాల్లో తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తిరుపతి వెళ్లారు. తిరిగి వచ్చేటపుడు విజయవాడ పరిసర ప్రాంతాలైన ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం రావడం కనిపించింది. దీంతో స్వయంగా తన కార్యాలయ అధికారులతో మాట్లాడారు. పరిస్థితి ఇలా ఉందేమిటని మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం.. సచివాలయం.. ఆపై జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు వీధుల బాట పట్టారు. ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో మురుగు కాలువల నుంచి దుర్గంధం వస్తుండడంతో.. జాతీయ రహదారిపై వెళ్లేవారు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. ఎనికేపాడులో కొంత కాలం క్రితం డయేరియా బెంబేలెత్తించింది.

ఆటోనగర్ కాలుష్యమే కారణం
ఆసియాలోనే అతిపెద్దదైన విజయవాడ ఆటోనగర్ పారిశ్రామికంగా పేరుగాంచింది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఇక్కడ రోజువారీగా జరిగే కార్యకలాపాలు.. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు.. వచ్చిపోయే వాహనాలు..ఆ వ్యాపార హడావుడి అంతా వేరే స్థాయిలో ఉంటుంది. ఎందరికో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అయితే, అదే సమయంలో కాలుష్యం కూడా ఎక్కువే. పక్కా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆటోనగర్ పరిశ్రమల నుంచి వచ్చే మురుగు ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో నిల్వ ఉంటోంది. సీఎం జగన్ ఆగ్రహం నేపథ్యంలో ఈ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆటోనగర్ మురుగును నిడమానూరు మీదుగా పంపించాలని నిర్ణయించారు. ఆటోనగర్ పరిశ్రమల నుంచి వచ్చే మురుగుపైనా చర్యలు తీసుకోనున్నారు.