Begin typing your search above and press return to search.

వైఎస్ జ‌గ‌న్ వారికి ద్వార ద‌ర్శ‌నం మొద‌లుపెట్ట‌బోతున్నారా?

By:  Tupaki Desk   |   29 July 2022 12:30 AM GMT
వైఎస్ జ‌గ‌న్ వారికి ద్వార ద‌ర్శ‌నం మొద‌లుపెట్ట‌బోతున్నారా?
X
ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏ విష‌యం చెప్పాల‌నుకున్నా న‌లుగురు కోఆర్డినేట‌ర్ల‌దే రాజ్య‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిల‌ను ఎమ్మెల్యేలు ఆశ్ర‌యించాల్సిందేన‌ని అంటున్నారు.

ఎమ్మెల్యేల‌కు ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే దాదాపు వారంతా ఈ న‌లుగురు కోఆర్డినేట‌ర్ల‌కు దగ్గ‌ర‌కు వెళ్తే వారు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని చెప్పుకుంటున్నారు. నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌కు వెళ్లే అవకాశం మాత్రం ఎమ్మెల్యేల‌కు ఉండ‌ద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. నేరుగా సీఎంకు ఏదైనా చెప్పుకుందామ‌నుకుంటే ద్వార‌పాల‌కుల మాదిరిగా వైవీ సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి మారార‌ని ఎమ్మెల్యేలు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్న ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు గ‌ట్టిగా నిల‌దీస్తుండ‌టంతో ఎమ్మెల్యేల్లో ప్ర‌స్టేష‌న్ ఇంకా పెరిగిపోతోంద‌ని చెప్పుకుంటున్నారు.

అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 మంది ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ టికెటు ఇవ్వ‌డం లేద‌నే వార్త కూడా వారిలో ఆందోళ‌న పెంచుతోంద‌నే టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎంను క‌ల‌వ‌డానికి దారి లేక‌పోవ‌డంతో ఎమ్మెల్యేలంతా ఆవేద‌న చెందుతున్నార‌ని అంటున్నారు. కొంత‌మంది టీడీపీ, జ‌న‌సేన పార్టీలో చేరిపోవ‌డానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. 175కు 175 వ‌స్తాయ‌ని జ‌గ‌న్ అనుకుంటున్నా అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు చూస్తే తెలుస్తుంద‌ని ఎమ్మెల్యేలు అంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌రకు పైగా స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేల ఆవేద‌న తెలుసుకున్న సీఎం జ‌గ‌న్ వారిని క‌ల‌వ‌డానికి ఓకే అన్నార‌ని చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఎమ్మెల్యేల‌ వ్య‌వ‌హారాల‌న్నీ కేవీపీ రామ‌చంద్ర‌రావు చ‌క్క‌బెట్టేవారు. ఎమ్మెల్యేలంతా ఆయ‌న చుట్టూనే ఉండేవారు. ఎప్పుడో ఒక‌సారి కానీ వైఎస్సార్ ద‌ర్శ‌నం ల‌భించేది కాద‌ని నాటి ప‌రిణామాల‌ను ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. వైఎస్సార్ ను క‌లిసిన‌ప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా త‌మ‌కు ద్వార ద‌ర్శ‌నం అయ్యింద‌ని చెప్పుకునేవారంట‌.

ఇప్పుడు జ‌గ‌న్ కూడా నేరుగా త‌న‌ను క‌లిసే అవ‌కాశం ఎమ్మెల్యేల‌కు ఇస్తుండ‌టంతో మ‌రోమారు త‌మ‌కు ద్వార ద‌ర్శ‌నం క‌ల‌గ‌బోతోంద‌ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.