Begin typing your search above and press return to search.

జగన్‌ను అటూ ఇటూ లాగేస్తున్నారుగా... ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:33 AM GMT
జగన్‌ను అటూ ఇటూ లాగేస్తున్నారుగా... ?
X
జగన్ ఇపుడు లడ్డూలా మారిపోయాడా. అంటే అవును అంటున్నాయి రాజకీయ పరిణామాలు. జగన్ కోసం జాతీయ స్థాయిలో గట్టిగానే చర్చ సాగుతోంది. జగన్ తమ వైపు ఉండాలని బీజేపీ ఎటూ కోరుకుంటుంది. అదే సమయంలో జగన్ తమ పక్షంలోకి రావాలని ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయిట. ఒక్క జగన్ కోసం ఢిల్లీ స్థాయిలో బస్తీ మే సవాల్ అన్నట్లుగా పోరు సాగుతోంది. దీనికంతటికీ కారణం ఏంటి అంటే ఏపీలో జగన్ బలంగా ఉన్నారు. ఆయన మళ్ళీ ఎన్నికల్లో కూడా గెలుస్తారు అన్న నమ్మకమే ఇపుడు అన్ని రాజకీయ పార్టీలకు ఆయన మీద మక్కువ కలుగచేస్తోంది.

జగన్ విషయం తీసుకుంటే ఆయన తనది తటస్థ వైఖరి అని చెబుతున్నారు. జగన్ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. తమది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధం మాత్రమే తప్ప బీజేపీ - వైసీపీల మధ్య ఎలాంటి బంధం లేదని కూడా కుండబద్ధలు కొడుతున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. జగన్ని అందులో చేరమని కోరారు కానీ ఆయన ససేమిరా అనేశారు. ఈ ఒక్క కారణం చాలు జగన్ బీజేపీకి దూరమే అని చెప్పడానికి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు చూస్తే జగన్ని తమ వెంట ఉంచుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు అన్న సంగతి తెలిసిందే. దాంతో జగన్ తోడు ఉంటే కచ్చితంగా మూడవసారి కేంద్రంలో అధికారాన్ని చలాయించగలమని బలంగా నమ్ముతోంది. దాంతో జగన్ తమ నుంచి దూరంగా పోకుండా బీజేపీ ఒక కంట కనిపెడుతోంది. అదే సమయంలో విపక్షల వైపు ఉన్న ప్రశాంత్ కిశోర్ జగన్ కి మంచి మిత్రుడు. ఆయన జగన్ని ఎలాగైనా విపక్ష కూటమి వైపునకు తీసుకురావాలని అనుకుంటున్నారు. జగన్ కనుక వస్తే కేంద్రంలో మోడీ సర్కార్ మళ్ళీ పవర్ లోకి రాలేదు అని ప్రశాంత్ కిశోర్ లెక్కలు వేస్తున్నారు.

ఇక జగన్ అయితే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే మాత్రం విపక్షం వైపు అసలు చూడరు. ఇక మోడీకి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో రెండు వందల సీట్లు దాటి వస్తే కనుక వైసీపీ మరో మారు బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా వంటి హామీలను నెరవేర్చుకుంటుంది అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. వాటిని ఏపీలో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలా వినియోగించుకోవాలో ఆయన‌కు బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు.