Begin typing your search above and press return to search.

తీవ్రమైన ఇబ్బందుల్లోనూ నాలుగేళ్లలో రూ.2340 కోట్లు ఖర్చుకు జగన్ రెఢీ

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:30 AM GMT
తీవ్రమైన ఇబ్బందుల్లోనూ నాలుగేళ్లలో రూ.2340 కోట్లు ఖర్చుకు జగన్ రెఢీ
X
సవాలు విసిరే ఆర్థిక సమస్యల్ని అస్సలు లెక్క చేయని ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరిగా చెప్పాలి. లక్ష్యాన్ని చేరుకోవటమే తప్పించి.. అందుకు అడ్డుగా ఉంటే సమస్యల్ని పెద్దగా కేర్ చేయని ఆయన సంక్షేమ పథకాల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తవాటిని తెర మీదకు తీసుకొస్తుంటారు. తాజాగా అలాంటి పథకాన్నే మరొకటిని తెర మీదకు తెస్తున్నారు.

ఇప్పటికే పలు వర్గాల వారికి భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న ఆయన.. తాజాగా రైతులకు తరచూ పెద్ద సమస్యగా మారే వ్యవసాయ బోర్ల విషయంలో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. వైఎస్సార్ జలకళ పేరుతో షురూ చేసిన ఈ పథకం రైతులకు వరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా రైతులకు పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రైతును ఆర్థికంగా దెబ్బ తీయటంతో పాటు.. అప్పులు పాలయ్యేలా చేసే బోర్లు వేసుకునే విషయంలో మిగిలిన పాలకులకు భిన్నంగా ఆలోచించారు జగన్. పంటలకు నీటి వసతి లేని రైతులు.. బోర్లు వేయించుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో వారు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతుంటారు. కొందరు రైతులు అయితే.. వరుస పెట్టి బోర్లు వేసి.. అప్పులపాలై.. చివరకు వాటిని కట్టలేక ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఇలాంటివాటికి చెక్ పెట్టేలా ఉచిత బోర్లు వేయించే ప్రోగ్రాంను వైఎస్సార్ జలకళ పేరుతో సరికొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఏపీ సీఎం. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ పథకాన్ని రేపటి (సోమవారం) నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకం కింద రానున్న నాలుగేళ్లలో రూ.2340 కోట్లు ఖర్చు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల బోర్లు తవ్వించటం మరో లక్ష్యంగా పెట్టుకున్ానరు.

ఈ పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి.. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ కాంట్రాక్టు ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశారు. కనిష్ఠంగా 2.5 ఎకరాలు.. గరిష్ఠంగా 5 ఎకరాలు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకునే చోట అంతకు ముందు బోరు ఉండకూడదు. అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పొలంలో జియోలాజికల్.. జియో ఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే బోరు వేసే కార్యక్రమాన్ని చేపడతారు. భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన 1094 రెవెన్యూ గ్రామాల పరిధిలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేయరు. ఈ పథకంలో రైతులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే బోర్లు వేయించుకునే వీలును కల్పిస్తారు. సర్కారుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి సంక్షేమ పథకాల విషయంలో దూకుడు ప్రదర్శించే జగన్.. తాజా జలకళతో మరో మెట్టుకు పైకెక్కుతారని చెప్పక తప్పదు.