Begin typing your search above and press return to search.

ఒక‌వైపు పింఛ‌న్లు క‌ట్‌.. మ‌రోవైపు వాళ్ల‌కు సొమ్ములు..ఇదేంది జ‌గ‌న‌న్నా!!

By:  Tupaki Desk   |   27 Dec 2022 3:56 AM GMT
ఒక‌వైపు పింఛ‌న్లు క‌ట్‌.. మ‌రోవైపు వాళ్ల‌కు సొమ్ములు..ఇదేంది జ‌గ‌న‌న్నా!!
X
వ‌ద్దు బాబూ.. మేం పింఛ‌న్ల‌పైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నాం.. మా పింఛ‌న్లు ర‌ద్దు చేయొద్దు.! అని వృద్ధులు.. వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లు ఒక‌వైపుగ‌గ్గోలు పెడుతున్నారు. కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల‌కు మొర పెట్టుకుంటు న్నారు. అయినా.. ప్ర‌భుత్వంలో క‌ద‌లిక‌లలేదు. కానీ, మ‌రోవైపు.. అస‌లు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోనివారికి.. వారు అర్హులో కాదో కూడా తెలియ‌ని వారికి మాత్రం వేల కోట్లు వేసేందుకు.. జ‌గ‌న్ రెడీ అయ్యారు. దీంతో ఈ ప‌రిణామంపై ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు.

ఏం జ‌రిగిందంటే.. అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో...అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి 2,79,065 మంది లబ్దిదారులకు రూ. 590.91 కోట్లను మంగ‌ళ‌వారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు.

పొరపాటున ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు పథకం లబ్ధి అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని వెరిఫై చాయాల‌ని సూచించారు. ఈ మేర‌కు అర్హులైన వారికి గ‌త డిసెంబర్‌ నుండి ఈ ఏడాది మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌ నెలలో, జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్‌ నెలలో...ఏ ఒక్కరికీ లబ్ధి అందకుండా ఉండకూడదని సీఎం పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే చేయడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాల‌ని పేర్కొన్నారు. పారదర్శకతతో లంచాలు లేకుండా, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో పథకాల లబ్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వమ‌ని ప్ర‌క‌టించుకున్నారు.

త‌మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి అందించాలనే గట్టి సంకల్పమ‌ని పేర్కొన్నారు. అది ఎంత ఎక్కువ మొత్తమైనా, ఆర్ధిక కష్టాలెన్ని ఉన్నా, చిరునవ్వుతో భరిస్తూ, పేదలకు మంచి చేసే దృఢ చిత్తం...ఏ ఒక్కరికైనా ఏ పథకమైనా ఏ కారణంచేతనైనా అందకపోతే వారికి కూడా ఎలా ఇవ్వాలా, ఎలా వారికి మంచి చేయాలా అనే తపనతో ముందుకు సాగుతున్నామ‌న్నారు. మ‌రి ఒక‌వైపు నిజ‌మైన అర్హులుగా ఏళ్ల త‌ర‌బ‌డి జ‌గ‌న్ అదికారంలోకి రాక‌ముందు నుంచి కూడా పింఛ‌న్లు తీసుకుంటున్న‌వారికి ఇప్పుడుఎత్తేయ‌డం ఎందుకు.. ఇలా.. వేరేవారికి వెతికి మ‌రీ పెట్ట‌డం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.