Begin typing your search above and press return to search.

జగన్ నోట మళ్ళీ మూడు రాజధానుల మాట... రెడీనా...?

By:  Tupaki Desk   |   15 Aug 2022 9:44 AM GMT
జగన్ నోట మళ్ళీ మూడు రాజధానుల మాట... రెడీనా...?
X
మూడు రాజధానులు ముగిసిన అధ్యాయం అని విపక్షాలు చెబుతున్నాయి. హైకోర్టు కూడా అమరావతి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని తీర్పు ఇచ్చేసింది. మరో వైపు చూస్తే కేంద్రం కూడా కర్నూల్ లో హై కోర్టు ఏర్పాటునకు పెద్దగా సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించడంలేదు. ఈ టైమ్ లో జగన్ నోట 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ మూడు రాజధానుల గురించి ప్రస్థావన రావడం చర్చకు తావిస్తోంది.

చాలా కాలానికి జగన్ మూడు రాజధానుల గురించి మాట్లాడారు. నిజానికి గత ఏడాది మూడు రాజధానుల మీద వైసీపీ సర్కార్ చేసిన బిల్లుని స్వయంగా ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. ఆ మీదట మరో బిల్లు అన్ని రకాలుగా సరిచూసుకుని సభలో మళ్లీ ప్రవేశపెడతామని జగన్ చెప్పారు. కానీ ఇన్ని నెలలు గడచినా అది కార్యరూపం దాల్చకపోవడంతో ఈ సంగతి ఇంతే అని అంతా అనుకున్నారు. కానీ జగన్ విజయవాడలో చేసిన ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల గురించి ఇండైరెక్ట్ గా ప్రస్థావించారు.

రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని జగన్ కుండబద్ధలు కొట్టార్. దీని ద్వారా ప్రాంతీయ అసమానతలకు ముగింపు పలకవచ్చు అని అన్నారు. అలాగే అక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలను కూడా తీర్చిదిద్దినట్లుగా అవుతుంది అని ని ముఖ్యమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జిల్లాల పెంపుదల జరగడం పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయమని జగన్ చెబుతూ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పుకోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.

మరో వైపు చూస్తే జగన్ విశాఖకు మకాం మారుస్తారు అన్న ప్రచారం వేడిగా సాగుతోంది. మంచి ముహూర్తం చూసుకుని విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి జగన్ పాలన చేస్తారు అని అంటున్నారు. అలాగే అసెంబ్లీలో మరోసారు మూడు రాజధానుల బిల్లుని కూడా తీసుకురానున్నట్లుగా ప్రచారం అవుతోంది.

వీటికి బలం చేకూరేలా జగన్ మూడు రాజధానుల మీద పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో ఎక్కడా తగ్గేదే అని చాటి చెబుతోంది అనుకోవాలి.