Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కావాలి..జ‌గ‌న్ రావాలి..లోకేష్ స‌భ‌లో నినాదాలు

By:  Tupaki Desk   |   9 Feb 2019 10:56 AM GMT
జ‌గ‌న్ కావాలి..జ‌గ‌న్ రావాలి..లోకేష్ స‌భ‌లో నినాదాలు
X
`జ‌గ‌న్ కావాలి...జ‌గ‌న్ రావాలి`..ఇది ఎవ‌రి నినాదం? రాజకీయాల గురించి అవ‌గాహ‌న ఉన్న వారికి దీని గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న ప్ర‌చార ప‌ర్వంలోని పిలుపు ఇది. కానీ ఈ పిలుపు ఎక్క‌డ ప్ర‌తిబింబించిందో తెలుసా? ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు..తెలుగుదేశం పార్టీ యువ‌నేత అయిన లోకేష్ స‌భ‌లో. ఔను. నిజ‌మే! లోకేష్ స‌భ‌లోనే...జ‌గ‌న్ రావాలి..జ‌గ‌న్ కావాలి అనే నినాదం ఉన్న కుర్చీలు క‌నిపించాయి.

వివ‌రాల్లోకి వెళితే...ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 4 లక్షల గృహప్రవేశాలను చంద్రబాబు సర్కార్ అట్ట‌హాసంగా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం భారీ ఎత్తున బహిరంగ సభ చేపట్టింది. ఏర్పాట్లు కూడా ఆర్భాటంగానే ఉన్నాయి. వందల కుర్చీలు వేశారు. ఇక్కడే తేడా వచ్చింది. వాటిపై జగన్ స్టిక్కర్లు ఉన్నాయి. జగన్ కావాలి.. జగన్ రావాలి అనే స్లోగన్స్ కూడా ఉన్నాయి. సభలో ఏర్పాటు చేసిన చాలా కుర్చీలపై ఇలాంటి జగన్ బొమ్మలు దర్శనం ఇచ్చింది. సభా నిర్వహకులు ఎవరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. సభ ప్రారంభం అయ్యే సమయానికి కూడా గుర్తించలేదు. కొందరు మీడియా వాళ్లు గమనించి ఫొటోలు - వీడియోలు తీయటం..అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డం అంతా జ‌రిగిపోయింది. దీంతో కలకలం చోటుచేసుకుంది. అప్పుడు అసలు విషయాన్ని గుర్తించని అధికారులు.. ఆ వెంటనే పరుగులు పెట్టారు. త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ చిర్రుబుర్రులాడారు. కానీ అప్ప‌టికే అది మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

ఈ న‌వ్వుల పాల‌యిన ఎపిసోడ్ వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణం ఉందంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం జరిగింది. ఆ సభలో కుర్చీల‌పై జగన్ కావాలి.. జగన్ రావాలి అని స్టిక్కర్లను అంటించారు. తాజాగా, వాటిని మంత్రి నారా లోకేష్ సభకు తరలించారు. ఏ మాత్రం పరిశీలించకుండా.. చెక్ చేయకుండా వేసేశారు. దీంతో..ఇలా లోకేష్ స‌భ న‌వ్వుల పాల‌యింది. జగన్ రావాలని లోకేష్ సభ ద్వారా కోరినట్లు ఉందంటూ కొందరు సెటైర్లు పేల‌డం కొస‌మెరుపు.