Begin typing your search above and press return to search.

పింఛన్ పంపిణీ పై జగన్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Feb 2020 2:30 PM GMT
పింఛన్ పంపిణీ పై జగన్ కీలక నిర్ణయం
X
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర వర్గాలకు పింఛన్ అందిస్తుండగా ఈ పింఛన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శ నిర్ణయం తీసుకుంది. ఇంటికొచ్చి పింఛన్ అందించే గొప్ప నిర్ణయం తీసుకుని విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో టీడీపీ నాయకులు చేసిన విమర్శలు జగన్ కు చిరాకు తెచ్చాయి. వాళ్లు చేస్తున్న ఆరోపణలను విని దాని పై చర్యలు చేపట్టారు. అర్హులకు పింఛన్లు అందడం లేదని విమర్శలు రావడం తో జగన్ దాని పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా అర్హులు పింఛన్లు అందడం లేదా అని పరిశీలనకు ఆదేశించారు. 10 రోజుల పాటు రీ-వెరిఫికేషన్ కు చేయనున్నారు.

ఈనెల ఒకటవ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ లో కొత్త తరహా విధానం అమలుచేశారు. నవశకం సర్వే ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నారు. అయితే 4 లక్షల 80 వేల మందికి పింఛన్లు అందడం లేదని, అర్హులైనప్పటికీ వాళ్లను కావాలనే తప్పించారని టీడీపీ గగ్గోలు పెడుతోంది. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ అందకపోతే ఎలా అని ఏపీ ప్రభుత్వం అర్హులకు అన్యాయం జరగ కూడదని భావనతో మరొకసారి పింఛన్ దారుల విషయంలో రీ-వెరిఫికేషన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 17వ తేదీ వరకు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.

అన్ని అర్హతలు కలిగి పింఛన్ రాలేదని భావిస్తున్న వారు గ్రామ వాలంటీర్ లేదా పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. అధికార యంత్రాంగం స్వయంగా ఇంటికి వచ్చి అర్హతలు పునః పరిశీలిస్తారు. వెరిఫికేషన్ లో అర్హులైనట్టు తేలితే ఫిబ్రవరి పింఛన్ కూడా కలిపి మార్చిలో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మొత్తాన్ని గ్రామ వాలంటీర్ స్వయంగా అర్హుల ఇంటికే వచ్చి అందిస్తారు. అర్హులకు అందాలనే ఉద్దేశంతో జగన్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 54 లక్షల 68 వేల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. దీనికోసం రూ.1,320 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈసారి పింఛన్ల లో కొత్తగా 6 లక్షల మంది చేరారు. రీ-వెరిఫికేషన్ మొదలైతే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.