Begin typing your search above and press return to search.

పార్టీ ఆఫీసుపై జగన్ కీలక నిర్ణయం!?

By:  Tupaki Desk   |   12 Aug 2021 1:30 PM GMT
పార్టీ ఆఫీసుపై జగన్ కీలక నిర్ణయం!?
X
వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఏపీ సీఎం జగన్ తరలించడానికి రెడీ అయ్యారట.. అక్టోబర్ నెలాఖరు వరకూ పార్టీ సెంట్రల్ ఆఫీసును విశాఖ పట్నంకు తరలించడానికి డిసైడ్ అయ్యారా? అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయం అమరావతికి దగ్గరలోని తాడికొండలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పరంగా కార్యాలయాలను తరలించడానికి కొద్దిగా ఆలస్యమైనా ముందు పార్టీ ఆఫీసును తరలించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ను జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి కోర్టులు , కేసులు, వివాదాలు, వాదాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. విశాఖకు పరిపాలన రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని జగన్ ప్రకటించారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అలాగే రాజధాని పరిధిలోని రైతులు కూడా కోర్టులో కేసులు వేశారు.

ఇక మూడు రాజధానుల అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. కాబట్టి హైకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమైతే వెంటనే వైజాగ్ కు జగన్ తరలిపోవడం ఖాయమని తేలిపోయింది.

అంతర్లీనంగా అవసరమైన ప్రయత్నాలు, ఏర్పాట్లను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చేస్తోందని తెలుస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పడిన కేసులను కొట్టివేయించుకునేందుకు ప్రభుత్వ పరంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రయత్నాలకు కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరిస్తే వెంటనే పరిపాలన రాజధానిని జగన్ వైజాగ్ కు తరలించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఈలోగా పార్టీ సెంట్రల్ ఆఫీసును విశాఖకు తరలించాలని జగన్ డిసైడ్ అయ్యాడు. ఇప్పటికిప్పుడు వైజాగ్ లో పార్టీ ఆఫీసు కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు భవనాన్నే తీసుకుంటున్నారట.. దీంతో తొందరలోనే సెక్రటేరియట్ కూడా విశాఖకు తరలివెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.