Begin typing your search above and press return to search.

మహిళలు మంటెక్కితే : ఆ హామీని వదిలేసిన జగన్...?

By:  Tupaki Desk   |   15 July 2022 3:30 PM GMT
మహిళలు మంటెక్కితే : ఆ హామీని వదిలేసిన జగన్...?
X
ఏపీలో అతి ముఖ్యమైన హామీని జగన్ అటకెక్కించేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని మద్య రహిత రాష్ట్రంగా చూపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ దిశగా అడుగులు వేయకపోతే మరో మూడేళ్ళ కాలానికి బార్లకు బార్లా పాలసీని విడుదల చేయడం అంటే ఏకంగా మంగళం పాడేసినట్లే అంటున్నారు.

ఏపీలో వైసీపీ సర్కార్ పదవీకాలం కేవలం ఇరవై నెలలు మాత్రమే ఉంది. మరి మూడేళ్ళ కాలానికి పాలసీని ప్రకటించడం అంటే తమ ప్రభుత్వ హయాంలో మద్య నిషేధాన్ని అమలు చేయలేమని చెప్పేసి చేతులెత్తేయడమే అంటున్నారు. ఈ విషయంలో జగన్ జనాలకు ఏమి జవాబు చెప్పుకుంటారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

నిజానికి ఏపీలో మధ్యం ఏరులై ప్రవహించడం వల్ల మహిళలే ఇబ్బంది పడుతున్నారు. మగవారు తాగేసి ఇంటికి సొమ్ము పెట్టకుండా ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకుని సర్వం పాడుచేస్తున్నారు. దాంతో మద్య నిషేధం అంటే మహిళా లోకం వెన్నంటి ఉండి జగన్ సర్కార్ వచ్చేలా చూసింది. కానీ ఇపుడు మాట తప్పి మహిళలకే మంట పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటే ఎలా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.

ఏపీలో చూస్తే మద్యం ద్వారా ఆదాయాన్ని నాటి టీడీపీ పాలన కంటే కూడా ఇబ్బడి ముబ్బడిగా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నారు. ఈ రోజుకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారా ఏపీకి వస్తోంది. దాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నారు అనే అంటున్నాయి విపక్షాలు.

అయితే బెల్ట్ షాపులను లేకుండా చేశాం కదా గతంల ఇంత సంఖ్య ఉంటే దాన్ని తగ్గించాం కదా అని వైసీపీ నేతలు ఎన్ని అయినా చెప్పవచ్చు కానీ ఏపీలో మద్యం మహమ్మారి మాత్రం ఇంకా అలాగే ఉండి తిష్ట వేసిందనే అంటున్నారు. ఇపుడు బార్లకు బార్లా తెరచుకునెలా పాలసీని ప్రకటించడం అంటే మహళల ఆగ్రహానికి నేరుగానే గురి కావడం అని అంటున్నారు.

ఇక కొత్తగా అమలులోకి రానున్న బార్ల పాలసీని తీసుకుంటే ఏకంగా ఏపీలో మరో 840 బార్లు వస్తాకు అనుమతులు వచ్చేసినట్లే. యాభై వేల జనాభాకు బార్లు ఉంటే ఒక రకంగా ఫీజులు, యాభై లక్షలకు ఉంటే మరో విధంగా ఆ పైన ఇంకో విధంగా ఫీజులను నిర్ధారణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విధంగా చేయడం వల్ల మద్య నిషేధం హామీ పూర్తిగా అటకెక్కినట్లే అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పాతిక వేల కోట్ల దాకా అప్పులను కూడా మద్యం ఆదాయాన్ని చూపించి ప్రభుత్వం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇపుడు విపక్షాలకు కోరి జగన్ సర్కార్ భారీ ఆయుధాన్నే అందించినట్లు అయింది.

దీన్ని కనుక వారు సరిగ్గా అందిపుచ్చుకుంటే వైసీపీ అతి ముఖ్యమైన హామీ మద్య నిషేధం మీద మాట తప్పిన ప్రభుత్వం మీద మహిళలు వీరావేశం ప్రదర్శిస్తే ఇక్కట్లే మరి. అలాగే అది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చేలా చేసే ప్రమాదం ఉంది అంటున్నారు.