Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌రా?

By:  Tupaki Desk   |   17 Sep 2021 1:30 PM GMT
జ‌గ‌న్ వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌రా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ నేత‌ల్లో ఇప్పుడు అంద‌రి దృష్టి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే ఉంద‌నేది కాద‌న‌లేని నిజం. కొత్త‌వాళ్ల‌లో ఎవ‌రికి అవ‌కాశం వ‌స్తుంది? ఎవ‌రిపై వేటు ప‌డుతుంది? అనే చ‌ర్చ‌లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న నేత‌లు అధినేత జ‌గ‌న్ ద‌ర్శ‌నం చేసుకుంటూ ఆయ‌న క‌టాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే మంత్రులుగా కొన‌సాగుతున్న నేత‌లు.. త‌మ ప‌ద‌వులు ఉంటాయో? లేదో? అని ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ మ‌ధ్య‌లో ఎమ్మెల్సీల ప‌రిస్థితే దారుణంగా త‌యారైంద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రివ‌ర్గంలో ఎమ్మెల్సీల‌కు చోటు ఉండ‌ద‌నే జ‌గ‌న్ అనుకుంటున్నార‌నే వార్త‌లు రావ‌డ‌మే అందుకు కార‌ణం.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఒక్క ఎమ్మెల్సీ కూడా లేరు. కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రుల జాబితాలోనూ వాళ్ల‌కు అవ‌కాశం ఉండ‌ద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వుల‌పై ఆశలు పెట్టుకున్న దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్సీల‌కు ఇది నిరాశ క‌లిగించే వార్తే. అయితే మంత్రి వ‌ర్గంలో ఎమ్మెల్సీల‌కు చోటు ఇవ్వ‌ద్ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెన‌క ఓ కార‌ణం ఉంది. మూడు రాజ‌ధానుల బిల్లుపై శాస‌న మండ‌లిలో జ‌రిగిన ర‌చ్చ త‌ర్వాత అక్క‌డ త‌మ పార్టీకి త‌గినంత బ‌లం లేద‌ని తెలిసిన జ‌గ‌న్ మొత్తానికి మండిలినే ర‌ద్దు చేయాల‌ని తీర్మానించారు. ఇప్పుడా తీర్మానం కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల కార‌ణంగా ప్ర‌భుత్వం కూడా ఇప్పుడు మండ‌లి ర‌ద్దుపై కేంద్రంపై పెద్ద‌గా ఒత్తిడి చేయ‌డం లేదు. మ‌రోవైపు కొంత‌మందికి కొత్త‌గా ఎమ్మెల్సీ అవ‌కాశం కూడా ఇచ్చారు. అస‌లు మండ‌లే వ‌ద్ద‌న్న జ‌గ‌న్‌.. ఎమ్మెల్సీల‌ను ఎంపిక చేయ‌డంపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

కానీ త‌న‌దైన మార్గంలో సాగుతున్న జ‌గ‌న్‌.. తిరుప‌తి లోక్‌స‌భ టికెట్ ఆశించిన బల్లి దుర్గా ప్ర‌సాద్ త‌న‌యుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి.. అక్క‌డ డాక్ట‌ర్ గురుమూర్తిని నిల‌బెట్టి గెలిపించుకున్నారు. మండ‌లిని కొన‌సాగించే ఉద్దేశం లేని జ‌గ‌న్‌.. అదే స‌మ‌యంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డంలో మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఎమ్మెల్సీ ప‌ద‌వులైతే ఇచ్చారు కానీ వాళ్ల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం మాత్రం జ‌గ‌న్‌కు లేద‌ని తాజా స‌మాచారం. ఇప్ప‌టికే మంత్రి మండ‌లి ర‌ద్దు కోసం తీర్మానం చేసిన ఆయ‌న‌.. ఇక ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తే మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా గ‌తంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రులుగా మారిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌ల‌ను మంత్రి ప‌ద‌వులకు రాజీనామా చేయించి రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఈ నేప‌థ్యంలో ఈ సారి కూడా ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు అంద‌వ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఉప్పుడు ఉన్న మంత్రుల్లోనే 60 శాతం మందితో రాబోయే ఎన్నిక‌ల‌కు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగినట్లు తెలుస్తోంది. దీని ప్ర‌కారం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భారీ మార్ప‌లేమీ ఉండ‌వనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో ఇప్ప‌టికే రేసులో ఉన్న ఎమ్మెల్యేల‌కే అవ‌కాశం ఇస్తారు కానీ ఎమ్మెల్సీల వ‌ర‌కూ వెళ్ల‌ర‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కూడా మ‌రో ఆరు నెల‌లు వాయిదా ప‌డ్డ‌ట్లు వార్త‌లొస్తున్నాయి.