Begin typing your search above and press return to search.

జగన్ ను చూసైనా నేర్చుకో చంద్రబాబు

By:  Tupaki Desk   |   29 Dec 2019 4:45 AM GMT
జగన్ ను చూసైనా నేర్చుకో చంద్రబాబు
X
మైకు కనిపించినంతనే రాజకీయ నేతల మనసుల్ని లాగేస్తుంటుంది. కొందరు బ్యాలెన్స్ గా ఉన్నా.. మరికొందరు అవసరానికి మించి మాట్లాడుతుంటారు. అలాంటి కోవకే వస్తారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు. మైకు కనిపిస్తే చాలు.. దాని అంతు చూసే వరకూ నిద్రపోని తత్త్వం ఆయన సొంతం. రోజు మొత్తంలో ఎన్నిసార్లు అయినా మాట్లాడటం తెలిసిన బాబుకు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించటం లాంటివి అస్సలు తెలీదు.

అవసరం ఉన్నా లేకున్నా అదే పనిగా మాట్లాడటం ద్వారా తప్పులు చేసే చంద్రబాబు.. తాను చేసే తప్పుల్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలీకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసైనా నేర్చుకోవాలని చెబుతారు. ఎందుకిలా అంటే.. ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారి వైజాగ్ కు వెళ్లిన వేళ.. ఆయనకు స్వాగతం పలికేందుకు.. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ ప్రజలు నిలుచొని.. జగన్ కాన్వాయ్ మీద పూల వర్షం కురిపించటాన్ని మర్చిపోలేం.

అలాంటివేళ కూడా మాట్లాడకుండా ఉన్న జగన్.. అనంతరం విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతారని భావించారు. కానీ.. అందరి అంచనాలకు భిన్నంగా జగన్ మైక్ తీసుకోకపోవటమే కాదు.. ఒక్క ముక్క కూడా మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. సింఫుల్ గా చేతులు జోడించి అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారే తప్పించి మాట మాట్లాడలేదు.

నిజానికి ఇదే సీన్లో చంద్రబాబు ఉండి ఉంటే.. తక్కువలో తక్కువ గంట సేపు స్పీచ్ ఇచ్చేవారు. తన ఘనతల డబ్బాను ఓపెన్ చేసేసి.. తన మాటలతో ప్రజలకు విసుగుపుట్టేలా చేసేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడున్నపరిస్థితుల్లో మాట్లాడే కన్నా.. మౌనంగా ఉండటం ఎంత అవసరమన్న విషయాన్ని జగన్ చేతల్ని చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలన్న విషయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసైనా బాబు అర్థం చేసుకుంటే మంచిదంటున్నారు. అన్నిసార్లు మాటలే ముఖ్యం కాదని.. మౌనం కూడా చాలా అవసరమన్న విషయాన్ని జగన్ తన తీరుతో చెప్పేశారు. మరిలాంటివి బాబుకు ఎప్పుడు అర్థమవుతాయో?