Begin typing your search above and press return to search.

సీనియర్ మోస్ట్ మినిష్ఱర్స్ కి జగన్ మార్క్ చెక్... .?

By:  Tupaki Desk   |   23 March 2022 4:30 PM GMT
సీనియర్ మోస్ట్ మినిష్ఱర్స్ కి జగన్ మార్క్ చెక్... .?
X
వైసీపీలో వారే సీనియర్ మోస్ట్ మినిష్ఱర్స్. వారు గత మూడేళ్ళుగా ప్రభుత్వానికి అండగా ఉంటూ వచ్చారు. ఆ ఇద్దరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. ఆ ఇద్దరికీ కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా జగన్ కేటాయించారు. వారు కూడా తమ సమర్ధతను ఎప్పటికపుడు నిరూపించుకుంటూ వస్తున్నారు.

అయితే మంత్రి వర్గ విస్తరణను త్వరలో చేపట్టబోతున్న నేపధ్యంలో సీనియర్లకు స్థాన చలనం ఉండబోదని ఇప్పటిదాకా వార్తా కధనాలు వచ్చాయి. ఎవరిని తప్పించినా బొత్స, పెద్దిరెడ్డిల సీట్లు పదిలం అని కూడా అంతా అనుకున్నార్జు. కానీ ఇపుడు వారి సీట్ల కిందకు కూడా నీరు చేరుతోందిట.

ఈ ఇద్దరు సీనియర్ మంత్రులను జగన్ ఈ మధ్య పిలిచి మాట్లాడారని, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపించే క్రమంలో ఈ ఇద్దరూ పూర్తిగా పార్టీ బాధ్యతలను తీసుకోవాలని జగన్ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే మంత్రి పదవులను పక్కన పెట్టి పార్టీ కోసం వీరు రానున్న రెండేళ్ళ కాలం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నమాట.

ఇదే జగన్ వారికి ఇచ్చిన సందేశం అంటున్నారు. ఇక బొత్స విషయానికి వస్తే ఆయన మునిసిపల్ శాఖను నిర్వహిస్తున్నారు. పెద్దిరెడ్డి కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీ రాజ్ శాఖలను చూస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా తమ ప్రాంతాలలో వైసీపీ గెలుపు కోసం గట్టిగా పనిచేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి 2019 ఎన్నికల్లో కేవలం చంద్రబాబు కుప్పం తప్ప అన్నీ గెలిపించుకుని వచ్చారు. లేటెస్ట్ గా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరేయడానికి పెద్దిరెడ్డి చేసిన కృషి చాలా ఉంది.

మరో వైపు చూసుకుంటే 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం తొమ్మిది సీట్లను వైసీపీ పరం చేసి క్లీన్ స్వీప్ చేయించిన ఘనతను బొత్స తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బొత్సను ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తారుట.

అదే విధంగా చిత్తూరు తో పాటు రాయలసీమ మొత్తం బాధ్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పగిస్తారు అని అంటున్నారు. అయితే మంత్రిగా ఉంటే ఆ హవా వేరు. ఆ జోరు వేరు. అధికార వైభోగం ఏ మాత్రం లేని పార్టీ పదవులను చేపట్టి ఈ ఇద్దరు ఏం చేస్తారు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న. పైగా సీనియర్లకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు అంటే మిగిలిన వారి గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాని అంటున్నారు. మొత్తానికి జగన్ మార్క్ మంత్రి వర్గ విస్తరణను అంతా త్వరలో చూడబోతున్నారు అని అంటున్నారు.