Begin typing your search above and press return to search.

స్థానిక ప‌ద‌వుల‌పై `జ‌గ‌న్` మార్కు.. `న్యాయం`

By:  Tupaki Desk   |   17 March 2021 6:30 AM GMT
స్థానిక ప‌ద‌వుల‌పై `జ‌గ‌న్` మార్కు.. `న్యాయం`
X
వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటేనే సంచ‌ల‌నాల‌కు మారు పేరు-అనే టాక్ వైసీపీ నేత‌ల నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆయ‌న త‌న కేబినెట్‌లో దేశంలోనే ఏ ముఖ్య‌మంత్రీ తీసుకోని విధంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇచ్చారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేశార‌నే పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఇదే ఫార్ములాను అనుస‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. స్థానికంలో అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు. ఎవ‌రినీ త‌క్కువ చేయ‌లేం. సో.. ఇప్పుడు అంద‌రికీ న్యాయం జ‌ర‌గాలి.. అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ త‌న‌దైన దూకుడుతో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నారు.

ఇక‌, జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని మంత్రి పెద్దిరెడ్డే బ‌య‌ట పెట్టారు. స్థానిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో త‌న స‌త్తా చాటుతూ.. అన్నింటినీ త‌న‌ఖాతాలో వేసుకుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రికీ ప‌ద‌వుల న్యాయం చేసేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు.. మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 18న మేయర్, చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉండ‌డంతో జ‌గ‌న్ నిర్ణ‌యం.. వైసీపీలోనే కాకుండా.. రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

రెండేసి డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్ ల ఫార్ములాని పాటించాలని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో అధికారులు ఆర్డినెన్స్ సిద్ధం చేశారు. ఏ క్షణమైనా గవర్నర్‌కు పంపి ఆమోద ముద్ర వేయించుకోనున్నారు. రెండు మున్సిపాలిటీల్లో (తాడిప‌త్రి, మైదుకూరు) తప్ప.. అన్ని చోట్ల వైసీపీనే సులువుగా చైర్మన్ పీఠాన్ని గెల్చుకోనుంది. అయినప్పటికీ.. పార్టీ నేతలు నిరాశ పడకుండా పదవులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉపసర్పంచ్‌ల ఎంపికల సమయంలో అలాంటి ఆలోచన రాకపోవడంతో.. వాటి గురించి ఆర్డినెన్స్‌లో చేర్చలేదు. ఇదిలావుంటే, త్వ‌ర‌లోనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. మ‌రి అప్పుడు ఎలాంటి ఫార్ములా అనుస‌రిస్తారో చూడాలి.