Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇచ్చిన స్ట్రోక్ బాగా ప‌నిచేస్తుందే..!

By:  Tupaki Desk   |   26 Oct 2019 2:30 PM GMT
జ‌గ‌న్ ఇచ్చిన స్ట్రోక్ బాగా ప‌నిచేస్తుందే..!
X
క‌రువ మంటే క‌ప్ప‌కు కోపం విడుమ మంటే పాముకు కోపం. వీరి ప‌రిస్థితి అలాగే ఉంది. ముందుకు పోతే గొయ్యింది.. వెనుక‌కు పోదామా అంటే నుయ్యింది.. గోతిలో ప‌డితే ప్రాణాలు పోతాయి.. నూతిలో ప‌డినా కూడా ప్రాణాలు పోతాయి.. ఏమీ చేయాలో పాలు పోవ‌డం ఇప్పుడు వీరికి. ఏపీ సీఎం వేసిన స్కెచ్‌ కు ఇప్పుడు క‌ళ్ళు బైర్లు క‌మ్ముతున్నాయి. జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్ర‌క‌ట‌న విన్న వారంతా ఆ.. ఇదేమ‌న్నా సాధ్య‌మ‌య్యేదేనా.. అంద‌రు అదే చెపుతారు.. త‌రువాత ఏమీ చేయాలో అదే చేస్తారు అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే తాను ఏదైతే చెప్పానో అదే ఆచరిస్తాను అని నిరూపిస్తున్నారు జ‌గ‌న్‌. ఆనాడు చేసిన ప్ర‌క‌ట‌న ఈనాడు అంద‌రికి భ‌లే స్ట్రోక్ ఇస్తుంద‌ని అర్థ‌మవుతుంది. ఇంత‌కు జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్ర‌క‌ట‌న ఏమిటీ. ఆ ప్ర‌క‌ట‌న తాలుకు స్ట్రోక్ ఏమిటీ అనుకుంటున్నారు క‌దా. ఓసారి చూద్దాం.

ఏపీ అసెంబ్లీలో 2014 ఎన్నిక‌లు అయిపోగానే టీడీపీ అధికారం చేప‌ట్టింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎం అయ్యారు. ఇక వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీగా మారింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఫిరాయించారు. ఓపార్టీ నుంచి గెలిచి మ‌రో పార్టీలోకి ఫిరాయిస్తే ఫిరాయింపుల చ‌ట్టం వ‌ర్తిస్తుంది. కానీ చంద్ర‌బాబు నిసిగ్గుగా పార్టీ ఫిరాయింపుల‌ను బాగా ప్రోత్స‌హించారు. అంతే కాదు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను మంత్రుల‌ను చేశారు. ఇది స‌రియైంది కాద‌ని - ఫిరాయింపుల చ‌ట్టం కింద వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా స్పీక‌ర్ గా ఉన్న దివంగ‌త మాజీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కు ఫిర్యాదు చేశారు. కానీ స్పీక‌ర్ పట్టించుకోలేదు.

త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో అంటే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. టీడీపీ ప్ర‌తిప‌క్షం లోకి మారింది. వైసీపీ నుంచి ఫిరాయించిన 23 సీట్ల‌ను మాత్ర‌మే టీడీపీ గెలుచుకుని గ‌ర్వ‌భంగం పొందింది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసి తొలిసారి అసెంబ్లీని స‌మావేశ ప‌రిచారు. అదే అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయింపుల‌పై జ‌గ‌న్ విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ ఫిరాయింపులను మా స‌ర్కారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌దు.. ప్రోత్స‌హించ‌దు. పార్టీ ఫిరాయింపులు అనే ఆంశాన్నే స్పీక‌ర్ వ‌ర‌కు వెళ్ళ‌కుండా చూసుకుంటుంది ఈ స‌ర్కారు. ఒకవేళ ఎవ్వ‌రైనా పార్టీ మారాల‌ని అనుకుంటే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేర‌వ‌చ్చు. గెలిచిన పార్టీకి రాజీనామా చేయ‌కుంటే స్పీక‌ర్ నిర్ణ‌యానికి మేము అడ్డు త‌గ‌ల‌బోము అని స్ప‌ష్టం చేశారు.

అంటే పార్టీలు ఫిరాయింపును స‌హించ‌మ‌ని - అలాంటి వాటిని ప్రోత్స‌హించ‌మ‌ని ఆనాడే గ‌ట్టి వార్నింగ్‌ - మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. అయితే జ‌గ‌న్ ఇచ్చిన మాస్ట‌ర్ స్ట్రోక్ ఎలా ప‌నిచేస్తుందంటే.. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు మారేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వైసీపీ ఓ నిర్ణ‌యం తీసుకుంది క‌నుక టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేను ఎట్టి ప‌రిస్థితిలో పార్టీలో చేర్చుకునే ప్ర‌శ్నే లేదు. ఒక‌వేళ‌ ఎవ్వ‌రైనా వైసీపీలోకి రావాలంటే ముందుగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలి. ఇది జ‌గ‌న్ ఇచ్చిన స్ట్రోక్‌. ఈ స్ట్రోక్ ఇప్పుడు ఎంత బ‌లంగా ప‌నిచేస్తుందంటే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు క‌నుక ప్ర‌త్యామ్నయంగా బీజేపీకిలోకి వెళ్ళాల‌ని అనుకుంటున్నారు. కానీ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ప్ర‌కారం వేటు ప‌డ‌క త‌ప్ప‌దు.

ఇటు వైసీపీలోకి రాలేరు.. అటు బీజేపీలోకి వెళ్ళ‌లేరు. ఏమీ చేయాలో ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌కు పాలు పోవ‌డం లేదు. ఇప్పుడు టీడీపీలో ఉంటే కేసుల భ‌యం. వీటి నుంచి త‌ప్పించుకుందామా అంటే పార్టీ ఫిరాయింపుల భ‌యం. అంటే ముందుకు పోదామా నుయ్యి ఉంది. అందులోనే ఉందామా టీడీపీ పెద్ద గొయ్యిగా ఉంది. నుయ్యిలో దూకితే ప‌ద‌వి పోత‌ది. గొయ్యిలో ఉంటే చేసిన పాపాల తాలుకూ కేసులు పీక‌ల మీద‌ వేలాడుతున్నాయి. ఏమీ చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం నుంచి త‌ప్పించుకునేలా టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓ ప్లాన్ చేశాడు. అదేమంటే ఇక ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయ‌డ‌మే ప‌రిష్కారం అనుకున్నాడు. అందుకు సిద్ద‌ప‌డే ఇప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరి జ‌గ‌న్ టికెట్ ఇస్తే పోటీ చేయ‌డం లేదంటే మ‌రో ప‌ద‌వితో స‌ర్దుకుపోవ‌డంకు వంశీ సిద్ద‌పడ్డాడ‌ట‌.

వంశీ లాగే అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైసీపీ - బీజేపీలో చేరేందుకు సిద్ద‌ప‌డుతున్నారు కానీ, రాజీనామా చేయ‌డానికి సాహ‌సించ‌డం లేదు. పార్టీ మార్పు త‌ప్ప‌ద‌నుకున్న వారు వ‌ల్ల‌భ‌నేని వంశీ బాట‌లో న‌డుస్తారు. లేద‌నుకున్న‌వారు టీడీపీలోనే ఉండ‌క త‌ప్ప‌దు. ఇది జ‌గ‌న్ ఇచ్చిన మాస్ట‌ర్ స్ట్రోక్‌. ఈ స్ట్రోక్‌కు ఇప్పుడు ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేలు క‌ళ్ళు బైర్లు క‌మ్మాయి. జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు చేసిన చెడ్డ పేరు త‌న‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డిన‌ట్లే. ఇక రాజ్యాంగం ప్ర‌కారం ప‌నిచేసినట్లు అవుతుంది. ఏమైనా జ‌గ‌న్ జ‌గ‌నే.