Begin typing your search above and press return to search.

బాబుకు అచ్చొచ్చిన జిల్లాలో జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు

By:  Tupaki Desk   |   21 July 2018 2:02 PM GMT
బాబుకు అచ్చొచ్చిన జిల్లాలో జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు
X
తూర్పుగోదావరి జిల్లా...తెలుగుదేశం పార్టీకి అండ‌గా నిలుస్తున్న జిల్లా. గ‌త ఎన్నిక‌ల్లో సైకిల్ పార్టీకి స‌పోర్ట్ ఇచ్చిన ఈ జిల్లాలో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్యంలో ఆ జిల్లాలో లెక్క‌లు మారుతున్నాయ‌నేది తాజాగా వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో స్ప‌ష్ట‌మైంది. జిల్లాలో కీల‌కంగా ఉన్న మత్స్యకారులు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌నేది తాజాగా జ‌రిగిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళంతో స్ప‌ష్ట‌మైందంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 217వ రోజు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని అచ్చంపేట జంక్షన్‌ లో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క ప్ర‌సంగం చేయ‌డ‌మే కాకుండా ప‌లు ముఖ్య‌మైన హామీలు ఇచ్చారు.

ఎన్నికలకు ముందు చక్కని ఫోటో పెట్టుకొని - పెళ్లికొడుకుగా తయారై ఒక్కో పేజీ ఒక్కో కులానికి తన మేనిఫెస్టోలో కేటాయించి ఆస‌క్తిక‌ర‌మై ఫోటోలతో మ్యానిఫెస్టో పెడ‌తార‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నెల నెల మత్స్యకారులకు ఫిషింగ్‌ హాలీడే సమయంలో రెండు నెలల పాటు రూ.4 వేలు ఇచ్చేది పెంచుతామని ఎన్నికలకు ముందు చెప్పారని - రూ.4 వేలు కూడా నూటికి పది మందికి మించి రావడం లేదని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ``ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏమంటారు? మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్కరికైనా అందాయా? ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయంటే చంద్రబాబు ఏమంటారు. వెంటనే ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాల్లో మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నారని వార్తలు రాస్తున్నారు. జీఓ వచ్చినా..పింఛన్‌ అందడం లేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు డ్రామాలు ఎంత కసిగా రక్తికట్టిస్తారన్నది ఇది ఓ ఉదాహారణ`` అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని జగన్ అన్నారు. ``చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు నెరవేర్చారా లేదా ? అన్నది ఆలోచించాలి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవారు మీకు నాయకులు కావాలా? మోసాలు చేసేవారు మీకు నాయకులు కావాలా?`` అని జ‌గ‌న్ అన్నారు.

నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏమిట‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ``చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై డీజిల్‌ ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా డీజిల్‌ సబ్సిడీపై పెంచలేదు. ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయంటే చంద్రబాబుకు మత్స్యకారులు గుర్తుకు వస్తాయి. డీజిల్‌ సబ్సిడీని వెంటనే పెంచబోతున్నారని వార్తలు వస్తాయి. కారణం ఏంటంటే జగన్‌ అనే వ్యక్తి మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ పెంచుతానని చెప్పిన తరువాత చంద్రబాబు నక్క బుద్ధి చూపించారు. మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. కొత్త స్కూళ్ల కథ దేవుడెరుగు ..ఉన్న స్కూళ్లను మూత వేస్తున్నారు. ఇదే పెద్ద మనిషి కేజీ నుంచి పీజీ వరకు పిల్లలను ఉచితంగా చదివిస్తా అన్నారు. ఇవాళ మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే పరిస్థితిలో ఉన్నామా?`` అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు పుణ్యనా రాష్ట్ర స్కూల్‌ మూత వేస్తున్నారని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `` గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంతవరకు పుస్తకాలు ఇవ్వలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతవరకు యూనిఫాం ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏంటో తెలుసా? ఈ పిల్లలు గవర్నమెంట్‌ స్కూళ్లకు వెళ్లడం మాన్పించాలి. జూలై చివరికి వచ్చినా పుస్తకాలు ఇవ్వకపోతే పిల్లలకు చదువు రాదని భావించి తల్లిదండ్రులు కష్టమైనా సరే తమ పిల్లలను నారాయణ - చైతన్య స్కూళ్లకు పంపిస్తారు అని ఆలోచ‌న‌`` అంటూ జ‌గ‌న్ పేర్కొన్నారు.

స్థానిక మత్స్యకారులు త‌నతో అనేక అంశాలు ఆవేద‌న‌గా పంచుకున్నార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ```మల్లాడి సత్యలింగనాయక ట్రస్ట్‌ పెట్టి మత్స్యకారులకు మేలు చేసేందుకు ట్రస్ట్‌ పెట్టారు. ఆ ట్రస్టుకు చెందిన 1500 ఎకరాల భూములను టీడీపీ నేతలు గద్దళ్లా దోచేస్తున్నారు. ఎకరాకు రూ.16 కౌలు చెల్లిస్తూ ఆ భూములు అనుభవిస్తున్నారు. ఆ భూములు మత్స్యకారులకే ఇస్తే వారు బాగుపడరా? ఆ ట్రస్టుకు డబ్బులు ఇచ్చి మేలు చేయాల్సింది పోయి..టీడీపీ నేతలే గద్దళ్లా దోచుకుంటున్నారు. ఇలాంటి అన్యాయమైన పాలన పోయి..రేపు పొద్దున మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయాలన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడుతున్నాను. ఆ నవరత్నాలు పేదలకు అందితే జీవితంపై ఆశ పుడుతుంది. మత్స్యకారులకు ఇచ్చిన హమీలను గుర్తు చేస్తాను. ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తే స్వీకరిస్తాను`` అని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

మ‌త్స్య‌కారుల సంక్షేమానికి మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ``ఈ మధ్యకాలంలోనే మత్స్యకారులకు హామీ ఇచ్చాను. ఫిషింగ్‌ హాలీడే ఏప్రిల్‌ 15 నుంచి రెండు నెలల పాటు ఉంటుంది. చంద్రబాబు హయాంలో రూ.4 వేలు కూడా సరిగా ఇవ్వలేదు. ఫిషింగ్‌ హాలీడేలో రెండు నెలల పాటు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఆ డబ్బు అక్కచెల్లెమ్మల చేతిలో ఆ డబ్బు పెడతాం. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీయట్‌ తీసుకువస్తాం. మీ గ్రామంలోనే చదువుకున్న పది మందికి ఉద్యోగం ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు 72 గంటల్లో అందే విధంగా ఏర్పాటు చేస్తాం. పింఛన్లు - మరుగుదొడ్ల కోసం లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా చేస్తాం. మత్స్యకారులకు ఇది కాక..డీజిల్‌ సబ్సిడీ చంద్రబాబు హయాంలో ఇవ్వడం లేదని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. ప్రతి ఒక్కరికీ డీజిల్‌ మీద ఇచ్చే సబ్సిడీ పెంచుతాం. డీజిల్‌ కొట్టేటప్పుడే ఆ డబ్బు అందేలా చూస్తాం. దాని కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పని లేదు. మీకు కార్డు ఇస్తాం. ఆ కార్డు చూపిస్తే పెట్రోలు - డీజిల్‌ పై సబ్సిడీకే పోసే విధంగా ఏర్పాటు చేస్తాం.` అని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఇంటికి తిరిగి వస్తారో? లేదో అని భయంతో బతుకుతున్నారని వారికి ప‌రిష్కారం చూపుతాన‌ని వెల్ల‌డించారు. ``హైరిస్క్‌లో ఉన్న మత్స్యకారులకు చెబుతున్నాను. రేపు పొద్దున ఇటువంటి ఘటన జరుగకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి తోడుగా ఉంటాను. చంద్రన్న భీమా నుంచి ఇప్పుడు సక్రమంగా పరిహారం అందడం లేదు. మనం వచ్చిన తరువాత మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తాం. మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ప్రతి మత్స్యకారుడికి తోడుగా ఉంటాం. ఇది కాక ఇంకా ఏమైనా మార్పులు - చేర్పులు ఉంటే సలహాలు - సూచనలు ఇవ్వండి. స్వీకరిస్తాం. `` అని జ‌గ‌న్ వెల్ల‌డించారు.