Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏలకు క్లాసులు తప్పవా ?

By:  Tupaki Desk   |   18 July 2022 6:30 AM GMT
ఎంఎల్ఏలకు క్లాసులు తప్పవా ?
X
సోమవారం సాయంత్రం ఎంఎల్ఏలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయటానికి ఎంపీలు, ఎంఎల్ఏలందరు ఎలాగూ అసెంబ్లీకి వస్తున్నారు. కాబట్టి ఓటింగ్ అయిపోయిన తర్వాత జగన్ అందరితో ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు. ఎంఎల్ఏలతో భేటీ ముఖ్య ఉద్దేశ్యం కొందరికి క్లాసులు పీకటమే అని పార్టీ వర్గాల సమాచారం. సీఎం ఎంతో టాప్ ప్రయారిటి ఇచ్చిన గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో కొందరు ఎంఎల్ఏలు పాల్గొనలేదని సమాచారం వచ్చిందట.

అలాగే మరికొందరు ఎంఎల్ఏలు ఏదో మొక్కుబడిగా హాజరవుతున్నట్లు నివేదికలు అందినాయి. సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని భేటీ సందర్భంగా ప్రస్తావించబోతున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన మొత్తం ఫీడ్ బ్యాక్ జగన్ దగ్గరకు చేరిందట. పైగా ప్రతిరోజు జగన్ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇందుకనే కార్యక్రమం మొదలు కాకమునుపే ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారు.

గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రతిఒక్క ఎంఎల్ఏ పాల్గొనాల్సిందే అని, ఎంఎల్ఏలు పార్టిసిపేట్ చేసే విషయాన్ని తాను మానిటర్ చేస్తుంటానని కూడా చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనే ఎంఎల్ఏల పనితీరును కూడా గమేనిస్తుంటానన్నారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు ఇలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటానని ముందుగానే జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఇంత స్పష్టంగా చెప్పినా కొందరు ఎంఎల్ఏలు పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదంటేనే వాళ్ళ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అలాంటి ఎంఎల్ఏల వైఖరికి రెండు కారణాలు ఉండచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. మొదటిదేమో ఎలాగూ తమకు టికెట్ దక్కదని కొందరు ఎంఎల్ఏలు ఫిక్సయిపోయారట. అలాగే ఇంకొందరిలో వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో అనాసక్తి పెరిగిపోతోందట.

ఎలాగూ టికెట్లు దక్కవని డిసైడ్ చేసుకున్న ఎంఎల్ఏలు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వైఖరితో ఉన్న కొందరు ఎంఎల్ఏలే జగన్ ఇంత స్పష్టంగా చెప్పినా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదని చెప్పుకుంటున్నారు.