Begin typing your search above and press return to search.

వారిద్దరి భేటీ వెనుక గులాబీ బాస్? 1

By:  Tupaki Desk   |   25 Sep 2015 6:40 AM GMT
వారిద్దరి భేటీ వెనుక గులాబీ బాస్? 1
X
ఇద్దరి మధ్య వైరం తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి మరీ పోట్లాడేసుకున్న వైనం ఏదైనా ఉందంటే.. అది రామోజీ.. వైఎస్ (ఆ తర్వాత జగన్) వ్యవహారాలుగానే చెప్పాలి. ఈ ఇద్దరిని వ్యక్తిగతంగా అభిమానించే కోట్లాది మంది తెలుగు వారు రెండు వర్గాలుగా విడిపోయి వాదోపవాదాలు.. ఎవరు మంచివారు.. ఎవరు తప్పు చేశారు? లాంటి వాదనల కోసం కొన్ని కోట్ల పని గంటలు ఖర్చు చేసి ఉంటారు. ఈ విషయం ఒక కొలిక్కి రాకముందే ఈ ఇద్దరు ఒకరి చేతిని మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటమే కాదు.. ఇళ్లకు వెళ్లే వరకూ సానిహిత్యం పెరిగింది.

ఆవేశం తగ్గించుకో.. మంచి భవిష్యత్తు ఉందని జగన ను ఉద్దేశించి రామోజీ వ్యాఖ్యానిస్తే.. మీ సాయం కావాలని జగన్ వినమ్రతగా అడగటమే కాదు.. నేరుగా రామోజీ ఇంటికే వెళ్లిన పరిస్థితి. ఉప్పు.. నిప్పు లాంటి ఈ ఇద్దరి మధ్య రాజీ ఒక్క రోజులోనో.. ఒక్క ఘటనతోనో జరిగిపోయిందా? అన్న ప్రశ్న వేసుకుంటే కాదనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకూ వారి మధ్య వైరం ఏ స్థాయిలో ఉండేదో బహిరంగ రహస్యమే. అంటే.. 15 నెలల క్రితం వరకూ వారి మధ్య మంట పుట్టించే వైరం ఉంది.

కానీ.. పదిహేను నెలల వ్యవధిలో ఇది కాస్త మాయం కావటమే కాదు.. రామోజీ ఇంటికి జగన్ నేరుగా వెళ్లే వరకూ వెళ్లటం అంటే చిన్న విషయం కాదు. సంధి కోసం రాజీ కోసం చేయి చాచిన వెంటనే రామోజీ స్పందిస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. 2004 ఎన్నికలు ముగిసి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 2005 వరకు ఇరువురి మధ్య సంబంధాలు ఒక మోస్తరుగానే ఉండేవి. అనంతరం వైఎస్ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఈనాడులో వార్తలు రావటంతో వైఎస్ లో అసహనం పెరిగేది.

దీనికి విరుగుడుగా ఆయన రామోజీతో రహస్య మంతనాలు జరిపేందుకు పలువురు దూతల్ని పంపారు కూడా. అయితే.. వాటికి రామోజీ ససేమిరా అన్నారని చెబుతారు. అలాంటి సమయంలోనే వైఎస్ సర్కారుతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల భూదాహాన్ని పేర్కొంటూ.. ‘‘పెద్దలా.. గద్దలా’’ అంటూ భారీ కథనం అచ్చేయటమే కాదు.. ఒకే ఎడిషన్ లో భారీగా పేజీలు కేటాయించటంతో వైఎస్.. రామోజీల మధ్య వార్ ముఖాముఖి అయ్యింది.

ఆ తర్వాతే మార్గదర్శి వ్యవహారం వెలుగులోకి రావటం.. సాంకేతికంగా ఉన్న లొసుగుల్ని వైఎస్ వాడేసుకోవటం.. వాటిని సరిదిద్దుకునేందుకు రామోజీ కిందా మీదా పడటం అంతా చరిత్ర. ఆ తర్వాత కూడా వారి మధ్య వైరం కొనసాగింది. 2009 ఎన్నికల సమయంలో వైఎస్ ఓటమే లక్ష్యంగా ఈనాడు పని చేసిందన్న మాట బలంగా వినిపించింది. దీనికి తగ్గట్లే ఆయన పత్రికలో వార్తలు వచ్చేవి. ఇంత చేసినా వైఎస్ విజయం సాధించటంతో రామోజీకి గడ్డు రోజులు తప్పవని భావించారు. ఆ సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రమాదవశాత్తు మరణించటంతో రామోజీ.. వైఎస్ ల మధ్య యుద్ధం నిలిచిపోయింది.

అయితే.. తండ్రి ప్రత్యర్థి.. తన ప్రత్యర్థిగా భావించిన జగన్.. తన పత్రిక ద్వారా రామోజీ మీద పెద్ద పోరాటమే చేశారు. అది కాస్త 2014 షార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ జరిగింది. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగటం.. ఇంకెప్పటికీ రామోజీ మీద వైఎస్ కుటుంబం అధిపత్యం చెలాయించలేదని.. ఇబ్బంది పెట్టేది లేదని తేలిపోయింది.