Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దీక్ష‌... ఫ్లైట్ మిస్ !

By:  Tupaki Desk   |   7 Oct 2015 6:40 AM GMT
జ‌గ‌న్ దీక్ష‌... ఫ్లైట్ మిస్ !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టిన సంద‌ర్భంగా ప్రారంభంలోనే పంచ్ ప‌డింది. వైఎస్‌ జగన్‌కు హైదరాబాద్‌లో ఫ్లైట్‌ మిస్‌ అయింది. దీక్ష చేపట్టేందుకు శంషాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్‌....ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు రావడంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది. దీంతో జగన్‌ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు.

ప్రత్యేక హోదా జాప్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్ర‌య‌త్నం లేద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో కేంద్రం కూడా కిమ్మనడంలేదని, అందుకే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం నడుం బిగించి పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు వైఎస్సార్‌సీపీ ప్ర‌క‌టిస్తోంది. సత్తెనపల్లి రోడ్డులోని మిర్చియార్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా ఈ రోజు ఉద‌యం ప్రారంభం కానుంది.

దీక్ష‌ను విజ‌య‌వంతం చేసేందుకు వైసీపీ భారీ ఏర్పాట్లే చేసింది. దాదాపు 200 మంది నాయకులు ఆసీనులు కావడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర సీనియర్ నాయకులు ఈ వేదికపై ఆసీనులవుతారు. దూరం నుంచి కూడా దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జ‌గన్‌మోహన్‌రెడ్డిలు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.