Begin typing your search above and press return to search.

జగన్.. అచ్చెన్న.. ముచ్చట్లే మరి...?

By:  Tupaki Desk   |   8 March 2022 7:52 AM GMT
జగన్.. అచ్చెన్న.. ముచ్చట్లే మరి...?
X
జగన్ విపక్షంలో ఉన్నపుడు గట్టిగా ఆయన్ని టార్గెట్ చేసిన మంత్రులలో అచ్చెన్నాయుడు ముందు వరసలో ఉండేవారు. సభలో జగన్ ఏది మాట్లాడినా వెంటనే కౌంటర్ అటాక్ చేసేందుకు నాడు అచ్చెన్న రెడీగా ఉండేవారు. జగన్ సైతం ఆరడుగుల ఎత్తు పెరిగావ్ అచ్చెన్నా, ఎందుకు అంటూ రివర్స్ అటాక్ చేసేవారు.

ఇలా టీడీపీ అయిదేళ్ల జమానాలో కూడా ఈ ఇద్దరి మధ్య రాజకీయ మాటల‌ సయ్యాట అలా సాగుతూనే ఉండేది. నిజానికి జగన్ చంద్రబాబుని తప్ప వేరే నాయకుడిని టార్గెట్ చేసింది పెద్దగా లేదు. ఆయన అదొక పాలసీగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. మిగిలిన నాయకుల విషయంలో విమర్శలు చేసే బాధ్యతను పార్టీకే ఆయన వదిలేసేవారు.

అయితే అచ్చెన్నాయుడు విషయంలో మాత్రం మొదటి నుంచి జగన్ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. దానికి కారణాలు కూడా వేరు అంటారు. ఆయన అన్న, దివంగత నేత, కింజరాపు ఎర్రన్నాయుడు జగన్ మీద సీబీఐ పెట్టిన కేసులలో ఇంప్లీడ్ అయ్యారు. అలా ఒక వైరం వ్యక్తిగతంగా ఉంది. దాంతో పాటు అచ్చెన్న సైతం పెద్ద నోరు చేసుకుని జగన్ మీద ఘాటైన విమర్శలు చేసేవారు.

ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అచ్చెన్నను బాగా టార్గెట్ చేస్తూ వచ్చారు. సభలో ఆయన మీద విమర్శలు చేయాలీ అంటే మంత్రులతో పాటు జగన్ కూడా ముందుంటున్నారు. గత మూడేళ్లలో అనేక సందర్భాల్లో ఇది జరుగుతూ వస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అచ్చెన్నను ఓడించాలన్నది జగన్ పంతం.

దాని కోసం గత రెండు ఎన్నికల్లోనూ ఆయన చాలా ఎక్కువగా టెక్కలి మీద ఫోకస్ పెట్టారు. అయినా ఫలితం అయితే లేదు. అచ్చెన్న అజేయుడుగానే గెలిచి వస్తున్నారు. దాంతో జగన్ కి ఆయన ప్రియమైన శత్రువుగా కూడా ఒక దశలో మారిపోయారు అనే చెప్పాలి. సభలో జోక్స్ వేసినా చలోక్తులు వేసినా కూడా అచ్చెన్న మీదనే జగన్ వేస్తూ ఉంటారు.

ఇక అచ్చెన్న సైతం హార్ష్ గా మాట్లాడినా జగన్ తో ముఖాముఖీ భేటీ అయితే మాత్రం ఆ సరదాను ఎంజాయ్ చేస్తూండడం జరుగుతోంది. ఇది ఎక్కువగా బీఏసీ సమావేశాల్లో చోటు చేసుకుంటోంది. గత బీఏసీలో చంద్రబాబుని సభకు తీసుకురండి అచ్చెన్నా అని జగన్ అంటే బాబు వస్తారు, మీరూ చూస్తారు అని రివర్స్ అటాక్ ఇచ్చారు అచ్చెన్న.

ఇక తాజా బీఏసీ మీటింగులో కూడా గవర్నర్ వయసులో పెద్ద కదా ఆయన ఉన్న సభలో నిరసన తగునా అచ్చెన్నా అని జగన్ అంటే మీరు చంద్రబాబుని వయసు చూసుకోకుండా కామెంట్స్ చేయడం బాగుందా అని కౌంటర్ గట్టిగానే ఇచ్చేశారు అచ్చెన్న. ఇక అచ్చెన్న బీఏసీ గదిలోకి ప్రవేశిస్తూంటే అచ్చెన్న కమ్ బ్యాక్ అని జగన్ సరదాగా అన్నారు. దానికి బదులుగా కమ్ బ్యాక్ ఏముంది. అసెంబ్లీ పెట్టారు కాబట్టే వస్తున్నా అని అచ్చెన్న జగన్ కి ధీటైన‌ బదులు ఇచ్చారు.

మొత్తానికి జగన్ అచ్చెన్నల రాజకీయ సెటైర్లు కానీ, కామెంట్స్ కానీ ముచ్చట్లుగానే అంతా చూస్తున్నారు. జగన్ సైతం అచ్చెన్నతో సరదాగా జోక్స్ కట్ చేయడానికే చూస్తారు అని అంటారు. ఏది ఏమైనా ఈ ఇద్దరిదీ ప్రియమైన శత్రుత్వం అని రెండు పాటీల నేతలు అంటున్న మాట. ప్రస్తుతానికి ఇలాగే కొనసాగినా రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు అన్న నానుడి ఉండనే ఉంది కదా.