Begin typing your search above and press return to search.

అదేం రోగమో...హైకోర్టుకు రాగానే సీబీఐకి స్పీడు తగ్గుతుందే

By:  Tupaki Desk   |   6 Feb 2020 12:48 PM GMT
అదేం రోగమో...హైకోర్టుకు రాగానే సీబీఐకి స్పీడు తగ్గుతుందే
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థ ఒక్కో చోట ఒక్కో రీతిన - ఒక్కో సమయంలో ఒక్కో తరహా వాదనలు వినిపిస్తోంది. తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టానని - అధికారిక కార్యక్రమాల వల్ల విచారణ జరిగే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనని - తన తరఫున తన లాయర్ గానీ - ప్రతినిధులు గానీ హాజరవుతారని - తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసుకున్న వినతి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు వస్తే... గయ్యిమని లేస్తున్న సీబీఐ అప్పటికప్పుడు కౌంటర్లు రెడీ చేసి... జగన్ కు వ్యక్తిగత మినహాయింపునిస్తే... ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించేస్తుంది. అదే పిటిషన్ హైకోర్టుకు వస్తే మాత్రం... అప్పటికే తొలి విడత విచారణ పూర్తి అయి పది రోజులు దాటినా... కౌంటర్ రెడీ చేయడానికి సీబీఐకి అస్సలు సమయమే లేనట్లుగా వ్యవహరిస్తోంది.

నిజమా? అంటే... గురవారం జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం జరిగిన విచారణను పరిశీలిస్తే... సీబీఐ ఈ తరహాలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని చెప్పక తప్పదు. వారం క్రితమే జగన్ తనకు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు... సీబీఐ వాదన ఏమిటని కోరింది. దీంతో నీళ్లు నమిలిన సీబీఐ తరఫు న్యాయవాది.. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మరింత గడువు కావాలని కోరారు. దీంతో చేసేదేమీ లేక ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది.

అయినా జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ కోర్టులో రెండు సార్లు పిటిషన్లు వేస్తే.. ఆ రెండు సార్లు కూడా కుదరదంటే కుదరదని అప్పటికప్పుడు కౌంటర్లు రెడీ చేసి మరీ జగన్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చేలా సీబీఐ కీలకంగా వ్యవహరించింది కదా. మరి ఇప్పుడు సేమ్ అదే పిటిషన్ ను జగన్ హైకోర్టులో దాఖలు చేశారు. మరి సీబీఐ కూడా... సీబీఐ కోర్టులో దాఖలు చేసిన మాదిరే హైకోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్ ను అప్పటికప్పుడు రెడీ చేసుకోలేదా? జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇస్తే... సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించొచ్చు కదా. మరి ఈ రెండు పనులు చేయకుండా సీబీఐ ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో తన మొండి వాదన చెల్లినట్లుగా హైకోర్టులో చెల్లదన్న సత్యాన్ని గ్రహించే సీబీఐ ఇలా వ్యవహరిస్తోందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.