Begin typing your search above and press return to search.

ఏటు చూసినా వైఎస్సార్ పేరే.. దేన్ని వదలని జగన్

By:  Tupaki Desk   |   23 Sep 2022 4:27 AM GMT
ఏటు చూసినా వైఎస్సార్ పేరే.. దేన్ని వదలని జగన్
X
తండ్రి పేరు మీద అభిమానం ఏ కొడుకైనా ఉంటుంది. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరికాస్త ఎక్కువగా ఉందని అనుకుందాం. అంత మాత్రానికి ప్రతి చోట తన తండ్రి పేరు తప్పించి మరో పేరు కనిపించకూడదన్నట్లుగా వ్యవహరిస్తే అసలుకు ఎసరు వస్తుందన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. దేనిలోనూ అతి ఉండకూదన్న విషయాన్ని మర్చిపోయి.. ఏపీలోని దేన్ని వదలకుండా ప్రతి దానికి వైఎస్సార్ పెట్టటం ద్వారా ప్రజలకు విసుగు తెప్పించేస్తున్న పరిస్థితి.

నిజమే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించని వారెవరూ. ఆ మాటకు వస్తే ఆయన్ను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం.. వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా అభిమానించే వారు కోట్లాది మంది ఉంటారు. మిగిలిన రాజకీయ నేతలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్యనున్న తేడా అదే. ఆయన పాలనపై వచ్చిన ఆరోపణలు ఎన్ని ఉన్నా.. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు.. చేపట్టిన కొన్ని పథకాలు.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ కష్టం వచ్చి.. అన్నా అని ఆయన్ను సంప్రదిస్తే చాటు.. అప్పటివరకు ఉన్న వైరాన్ని పక్కన పెట్టేసి.. నేనున్నా అంటూ భరోసా ఇచ్చి.. వారి సమస్యను సాల్వ్ చేసే సత్తా ఆయన సొంతం. అందుకే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు సైతం సాఫ్ట్ కార్నర్ గా చెప్పాలి.

తండ్రి తత్త్వాన్ని అర్థం చేసుకునే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. తన తండ్రి పేరును కనిపించిన ప్రతి చోట పెట్టేందుకు చూపించే ఆసక్తి.. ఆయన తరహా పాలనను.. ఆయన తరహాలో విషయాల్ని డీల్ చేసే విషయంలోనూ జగన్ పాటించన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్లే ఆయన మూడున్నరేళ్ల పాలన ఉందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన వేళ.. తెలుగోళ్లంతా అభిమానించి.. ఆరాధించే ఎన్టీవోడిని జగన్ టచ్ చేయకుండా ఉంటే బాగుండేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికే ఏపీలోని ఏ మూల చూసినా వైఎస్సార్ పేరు కనిపిస్తూ.. వినిపిస్తూ ఉన్న వేళ.. ఎన్టీఆర్ విషయంలో ఇలా చేయటం సరికాదన్న విమర్శకు బలాన్ని చేకూరే కొన్ని అంశాల్ని ప్రస్తావించాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 'వైఎస్సార్' పేరును ఒక ఉద్యమంలా మార్చి..ఎక్కడ చూసినా.. దేన్ని పట్టుకున్నా వైఎస్సార్ పేరు మాత్రమే వినిపించేలా ఆయన చేశారు. శాంపిల్ గా కొన్నింటిని చెప్పుకొస్తే..

నరసరావుపేట పట్టణంలోని 200 పడకల ఆసుపత్రికి.. తిరుపతిలోని వెటర్నరీ వర్సిటీ ప్రధాన భవనానికి.. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాలతో పాటు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించే భవనానికి..తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రికి వెళ్లే మార్గానికి.. గూడూరు మున్సిపల్ కార్యాలయ భవనానికి.. పుత్తూరులోని మెప్మా భవనానికి.. పుత్తూరులోని పార్కుకు.. పొన్నూరులోని పురపాలక సంఘానికి.. బాపట్ల జిల్లాలో 40 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రానికి.. బాపట్ల మార్కెట్ యార్డుకు.. చుండూరు మండలంలో చినపరిమి గ్రామ సచివాలయానికి.. పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్ యార్డు ఆర్చికి.. చిలకలూరి పేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ కు.. ఇదే చిలకలూరిపేట పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డుకు.. విశాఖలోని సిటీ సెంట్రల్ పార్కుకు.. విజయవాడలోని జక్కంపూడి కాలనీకి.. విజయవాడలోని భవానీపురం క్రాంబే రోడ్డుకు.. నెల్లూరు నగర పాలక సంస్థకు "వైఎస్సార్" పేరును పెట్టేశారు. వీటిల్లో కొన్నింటికి గతంలో ఉన్న పేర్లను మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టేయటం గమనార్హం.

ఇక్కడితే లిస్టు అయిపోయిందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఉన్న వాటిల్లో మరికొన్నింటిని ప్రస్తావిస్తే.. కందుకూరులోని ఉద్యాన కాలేజీకి.. అదే ఊరిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు.. చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి.. క్రిష్ణా వర్సిటీలో పరిపాలన భవనానికి ఉన్న బ్లాక్ కు.. శ్రీకాకుళం పట్టణంలోని కల్యాణ మండపానికి.. తాడేపల్లిగూడెం ఉద్యాన వర్సిటీలోని రైతు శిక్షణ కేంద్రానికి.. వెల్లిగల్లు ప్రాజెక్టుకు.. వరికపైూడిసెల ఎత్తిపోతల పథకానికి.. పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకానికి.. వేదాద్రి ఎత్తిపోతలకు.. తాడిగడప పురపాలక సంఘానికి.. విజయవాడలోని అవతార్ పార్కుకు.. కడపలోని బస్ స్టేషన్ కు.. పొద్ర్దుటూరులోని పురపాలక సంఘానికి.. కడపలోని ఇండోర్ స్టేడియానికి.. కడపలోని క్రీడా పాఠశాలకు..ఉద్యాన వర్సిటీకి.. కలిదిండిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి.. అచార్య నాగార్జున వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలకు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉదాహరణలు.. వీటన్నింటికి ముందు ఉండే పేరు.. "వైఎస్సార్"

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.