Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులు... జగన్ ఆలోచనలు అవే...?

By:  Tupaki Desk   |   2 April 2022 10:37 AM GMT
కొత్త మంత్రులు... జగన్ ఆలోచనలు అవే...?
X
ఏపీలో కొత్త మంత్రివర్గం కూర్పు దాదాపుగా ఖాయం అయిందనే అంటున్నారు. ఈసారి వచ్చేది ఎన్నికల మంత్రివర్గం. అంటే రేపటి ఎన్నికల్లో ఈ మంత్రులే ప్రచారంలో ఉంటారు. జనాల వద్దకు వెళ్తారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్పుకుంటారు. దాంతో కొత్త మంత్రుల ఎంపిక ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. దీని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలను చూస్తే కొన్ని ప్రధాన సామాజికవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత దక్కబోతోందని తెలుస్తోంది.

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో అగ్ర తాంబూలం ఇస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కూడా బీసీలు దాదాపుగా మూడవ వంతు ఉన్నారు. అలాగే ఎస్సీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈసారి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏపీలో కులాల సంకుల పోరాటంగా రాజకీయాలు మారుతున్న క్రమంలో వైసీపీకి కలసివచ్చే వర్గాలను అక్కున చేర్చుకునేందుకు కొత్త మంత్రివర్గం కూర్పుని ఒక అవకాశంగా తీసుకుంటారు అని తెలుస్తోంది.

రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఇది అధికారిక లెక్క కాదు కానీ బీసీ సంఘాల నేతలు ఎపుడూ చెబుతూ ఉంటారు. నిజంగా బీసీ కుల గణన జరిగితే ఆ విషయం నిజమే అని తేలే అవకాశం ఉంది. దాంతో మొత్తం మంత్రులలో కనీసం పది మంది దాకా బీసీల నుంచి వస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో ఎనిమిది మంది దాకా ఉన్న ఈ సంఖ్య అలా పెరుగుతుంది అని అంటున్నారు. అదే విధంగా ఎస్సీలకు కూడా గతసారి అయిదు దాకా మంత్రి పదవులు దక్కాయి ఇపుడు అరడజనుకు తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు.

మైనారిటీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, కమ్మలకు ఒకటి ఇలా లెక్క తీసుకుంటే అక్కడికే 19 దాకా కొత్త మంత్రులు ఉంటారని అంటున్నారు. మరి మిగిలిన అయిదింటిలోనే అంతా సర్దుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ తడవ అగ్ర వర్ణాల నుంచి బాగా కుదింపు ఉండవచ్చు అని సంకేతాలు అయితే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గంతో పాటు దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలను తమ వైపునకు తిప్పుకోవాలన్న వైసీపీ ఆలోచనల మేరకే కొత్త మంత్రివర్గం కూర్పు ఉండవచ్చు అని తెలుస్తోంది.

ఈ తరహా సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో జగన్ కి విశేష అనుభవం ఉంది. ఇప్పటికి చాలా సార్లు సక్సెస్ ఫుల్ గా ఆయన దాన్ని అమలు చేసి చూపించారు కూడా. మొత్తానికి చూసుకుంటే కొత్త మంత్రులు ఎవరు అవుతారు అన్నది మాత్రం ఉత్కంఠను కలిగించేదిగానే అంతా చూస్తున్నారు.