Begin typing your search above and press return to search.
జగన్ నయా వ్యూహం : జనంతోనే పందెం...?
By: Tupaki Desk | 9 July 2022 3:11 PM GMTప్రజలు ఎపుడూ మనవాళ్ళే అని నాయకులు అనుకుంటారు. వారి మనకే ఓటేస్తారు అని అధినాయకుడు ధీమాగా ఉంటాడు. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఆయనకు తెలిసినా తెలియనట్లుగా చేసే అధికారం మత్తు ఎపుడూ పక్కనే ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్కులెన్నో చుట్టుపక్కల ఉండడం వల్లనే సుదీర్ఘ కాలం ఏ నాయకుడు అధికారంలో ఉండలేకపోతున్నారు.
ఇక టీడీపీ విజన్ 2020 అని 1999లో రెండవసారి గెలిచిన తరువాత ప్రకటించింది. నాడు యువ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మరో ఇరవై ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీలో తమదే అధికారం అని చెప్పడానికే విజన్ 2020ని ముందుకు తెచ్చారు. కానీ ఆ తరువాత నాలుగేళ్ళకే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. తిరిగి సీఎం అయింది 2014లో మాత్రమే.
ఇక విభజన ఏపీలో బాబు మరో కొత్త స్లోగన్ తీసుకున్నారు. విజన్ 2050 అని ఊదరగొట్టారు. ఏపీలో అపొజిషన్ అన్నది లేనే లేదని తాను నమ్మారు, తమ్ముళ్ళను నమ్మమన్నారు. కానీ జనాలు మాత్రం దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. అలా 2019 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయింది.
ఇపుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా చిరకాలం తామే పవర్ లో ఉంటామని భావిస్తోంది. జగన్ సైతం ఏ ఎన్నిక అయినా మనదే గెలుపు అని అంటున్నారు. ప్లీనరీ సాక్షిగా జగన్ ఈ విషయాన్ని పదే పదే క్యాడర్ కి చెప్పారు. ఏపీలో విపక్షమే లేదని కూడా ఆయన అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబుని, ఆయన టీడీపీని లైట్ తీసుకున్నారు.
ఇక్కడ జగన్ ధీమా ఏంటి అంటే జనాలు. జనాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం కాబట్టి వారు తప్పకుండా తమను గెలిపించి తీరుతారు అన్నదే జగన్ ఆలోచన. అందుకే ఆయన టీడీపీని, చంద్రబాబుని మరోసారి ఓడించాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకోవాలని పిలుపు ఇచ్చారు.
అంతే కాదు, వారే వచ్చే ఎన్నికల్లో అర్జునుడు మాదిరిగా విజృంభించి కౌరవులు అయిన విపక్షాన్ని ఓడించాలని కోరారు. అంటే జగన్ వ్యూహం ఏంటో ఇక్కడ తెలుస్తోంది. ప్రజలకు మేలు చేశాం కాబట్టే వారే ఈసారి ముందు వరసలోకి వచ్చి అపోజిషన్ని అడ్డగించి మరో మారు తమకు పట్టం కడతారని.
అంతే కాదు ఆయన మరో మాట అన్నారు. నేను మంచి చేశాను అని ఆలోచించి ఓట్లేయండి అని. తన పాలనను, టీడీపీ ఏలుబడిని కూడా బేరీజు వేసుకుని మరీ ప్రజలు తీర్పు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ వంటి పెత్తందారీ పార్టీ వస్తే పేదలకు మేలు జరగదని, ఆయన చుట్టూ ఉన్న పెద్దలే బాగుపడతారని కూడా జగన్ అనడం ఇక్కడ విశేషం.
మొత్తానికి జగన్ అయిదు కోట్ల జనాలనే నమ్ముకుని 2024 ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అనుకోవాలి. అంత కాదు వారినే ముందు పెట్టి పందెమాడుతున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ విజయం సాధిస్తే అది ప్రజా విజయం అని చెప్పుకుంటారు. కానీ ఒకవేళ ఫలితం తేడా కొడితే బాబు మాదిరిగా అదే జనాలనే వైసీపీ వారు విమర్శిస్తారా. ఏమో చూడాలి మరి.