Begin typing your search above and press return to search.

జగన్ కు ఎందుకు కుదరటం లేదు..?

By:  Tupaki Desk   |   30 Dec 2015 5:17 AM GMT
జగన్ కు ఎందుకు కుదరటం లేదు..?
X
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోతున్నారు. పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన జాడే కనిపించని పరిస్థితి. రాజకీయంగా వైరుధ్యాలు మామూలే. అయితే.. హుందగాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకరితో కాకున్నా.. ఒకరితో అయినా సానుకూలంగా వ్యవహరించటం చాలా అవసరం. అదేం చిత్రమో కానీ.. జగన్ మాత్రం ఎవరితోనూ సంబంధాలు లేనట్లుగా కనిపించటం గమనార్హం.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టటం ఇందులో ఒకటి. ప్రధాని మోడీ హాజరైన ఈ కార్యక్రమం ఏపీ రాష్ట్రానిది. చంద్రబాబు సొంత కార్యక్రమం ఎంత మాత్రం కాదు. కొత్త రాజధాని శంకుస్థాపన ముఖ్యమంత్రిది ఎంత కీలకపాత్ర ఉంటుందో.. కాస్త అటూఇటూగా జగన్ కు అంతే పాత్ర ఉంటుంది. అయితే.. రాజకీయం పుణ్యమా అని జగన్ ఆ కార్యక్రమానికి హాజరు కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగం. ఎక్కడెక్కడి వారో ఈ కార్యక్రమానికి హాజరైతే జగన్ హాజరు కాలేదు. అయితే.. ఆయనకు ఈ కార్యక్రమానికి పిలవలేదన్న మాట చెబుతున్నారు. ఇందులో నిజానిజాల్ని రెండు పక్షాలు బహిరంగంగా మాట్లాడింది లేదు.

ఒకవేళ..ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనటం ఇబ్బంది అయితే.. మంగళవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ఏపీ విపక్ష నేత జగన్ హాజరు కావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగత పనుల నేపథ్యంలో ఆయన హాజరు కావటం లేదని సమాచారం ఇచ్చారు. దూరంగా ఉండటం తప్పేంకాదు. కానీ.. దూరంగా ఉండటానికి.. వివిధ కార్యక్రమాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టటానికి సరైన కారణం ఉండాలి. అదేం లేకుండా.. వ్యక్తిగత పనులతో హాజరు కాలేకపోతున్నట్లుగా సమాచారం ఇవ్వటం ద్వారా.. జగన్ కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. కార్యక్రమం ఏదైనా దూరంగా ఉండటం తప్పు లేదు కానీ.. నల్లపూసలా అయిపోవటం అంత సరికాదేమో.