Begin typing your search above and press return to search.

రహస్య స్నేహితుడ్ని పిలవలేదంట

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:05 AM GMT
రహస్య స్నేహితుడ్ని పిలవలేదంట
X
వ్యక్తిగత హోదాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఆదివారంతో పూర్తి కానుంది. గడిచిన నాలుగు రోజులుగా నభూతో అన్న చందంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది వీవీఐపీలు హాజరయ్యారు. కొందరి వీఐపీలు అయితే.. మొదట తాము వెళ్లటం.. యాగం చేస్తున్న తీరు చూసి ముచ్చటపడి.. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు. ఊహించని విధంగా వస్తున్న వీఐపీల్ని కంట్రోల్ చేయటానికి మంత్రి హరీశ్ రావు స్వయంగా కలుగజేసుకోవాల్సి వచ్చింది. యాగానికి ఆహ్వానించిన వీఐపీలు సైతం పరిమితంగా రావాలని కోరారు.

భారీగా సాగుతున్న యాగానికి కేసీఆర్ ఎంతోమందిని ఆహ్వానించారు. మరి.. ఇంతమందిని పిలిచిన ఆయన.. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. తన రహస్య మిత్రుడు వైఎస్ జగన్ ను ఆహ్వానించలేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు సాయం చేయటం దగ్గర నుంచి.. పలు అంశాల మీద ‘మాట’ సాయంగా ఉండే జగన్ ను పిలవకపోవటమేమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.

వందలాది మందిని యాగానికి ఆహ్వానించిన కేసీఆర్.. వైఎస్ జగన్ ను పిలవకుండా ఉంటారా? అన్నది ఒక ప్రశ్న. ఇంతమంది యాగానికి వస్తుంటే.. జగన్ ఎందుకు రావటం లేదు? పూజలు.. పునస్కారాలు.. యాగాలు లాంటివి జగన్ కు నచ్చవా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం జగన్ కు యాగం ఆహ్వానం అందలేదన్న మాటను చెబుతున్నారు. దీనికి సాంకేతిక కారణాలన్న మాట వినిపిస్తోంది.

జగన్ పాటించే ధర్మం హిందూమతం కాకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది. హిందూసంప్రదాయం ప్రకారం.. పూజలు.. శుభకార్యాక్రమాలకు అన్యమతస్తుల్ని ఆహ్వానించటం తప్పు కాదు. అయితే.. అయుత చండీస్యాగాన్ని నిర్వహించే రుత్వికుల ఆదేశాలకు తగ్గట్లుగా అన్యమతస్తుల్ని ఆహ్వానించలేదన్న మాట వినిపిస్తోంది. చండీయాగం లాంటివి మొత్తం పండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. వారి మాటే చెల్లుబాటు అవుతుంది. వారు చెప్పినట్లుగానే యాగం నిర్వాహణ ఉంటుందని.. అందుకే జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కీసీఆర్ ఆహ్వానించలేదన్న మాట వినిపిస్తోంది.