Begin typing your search above and press return to search.

జగన్ నంబర్ ఏడు.. బాబు నంబర్ 29...నో యూజ్... ?

By:  Tupaki Desk   |   9 Feb 2022 12:30 AM GMT
జగన్ నంబర్ ఏడు.. బాబు నంబర్ 29...నో యూజ్... ?
X
భారత దేశాన చాలా మంది రాజకీయ నాయకులు ఢిల్లీ వైపు వెళ్ళే ఫ్లైట్ ముఖం కూడా చూసి ఉండరు. దానికి ఏపీ పక్కనే ఉన్న ఒడిషా సీఎం ఒక నిలువెత్తు ఉదాహరణ. ఆయన ఇప్పటికి రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో దఫా గెలిచేందుకు కూడా రెడీగా ఉన్నారు. ఆయన ఎపుడూ ఢిల్లీ వైపు వెళ్లలేదు. కనీసం జాతీయ స్థాయి వార్తలలో కనిపించాలన్న ఆతృత ఆసక్తి కూడా ఏమీ లేదు. అయినా ఆయన స్టేట్ కి రావాల్సినవి అన్నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి.

ఇక కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మూడు దశాబ్దాల పైగా కామ్రెడ్స్ బెంగాల్ ని ఏలారు. ఇక జ్యోతీబాస్ పాతికేళ్లకు పైగా సీఎం గా యమ దర్జాగా పనిచేశారు. ఆయన కూడా ఏ రోజూ ఢిల్లీ వెళ్లలేదు. కానీ అక్కడ స్టేట్ లో డెవలపమెంట్ ఎక్కడా ఆగలేదు. కేంద్రంలో ఎవరున్నా వారికి దక్కాల్సినవి దక్కేశాయి.

తమిళనాడులో ఎవరు సీఎంలుగా ఉన్నా ఢిల్లీ పోరంటే పోరు. కానీ వారు తెచ్చుకోవాల్సినది దెబ్బలాడి మరీ తెచ్చుకుంటారు. ఇక ఇలాగే దేశంలో చాలా రాష్ట్రాల వారు ఉన్నారు. కానీ ఏపీ విషయానికి వస్తే ఇద్దరు సీఎంలు ఢిల్లీ టూర్లు బాగానే చేశారు. కానీ ఫలితం ఏంటి అంటే నిరాశే కలుగుతుంది.

జగన్ సీఎం అయ్యాక కనీసం డజన్ సార్లు దాకా ఢిల్లీ వెళ్ళి ఉంటారు. అందులో ఏడు సార్లు ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా ఇమ్మని విన్నపాలు చేసుకున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి నంబర్ టూ అయిన అమిత్ షాని జగన్ పదిహేను సార్లు కలసి మరీ హోదా ఇవ్వాలని కోరారట. ఇదంతా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభలో చెప్పుకొచ్చిన వైనం.

ఇక చంద్రబాబు తాను సీఎం గా ఉండగా 29 సార్లు ఢిల్లీ వెళ్లాలని, ప్రత్యేక హోదా సహా విభజన హామీల విషయంలో కేంద్ర పెద్దలకు విన్నవించానని తరచూ చెప్పేవారు. మరి ఇన్ని చేసినా కూడా చంద్రబాబు ఏం సాధించారు అంటే ఏమీ లేదనే చెప్పాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఆయన హయాంలోనే కేంద్రం చెప్పేసింది. ఇక విభజన హామీలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

జగన్ అయితే ప్రధాని మోడీతో ఏ పేచీ పెట్టుకోలేదు, పైగా రాజ్యసభలో వైసీపీ ఎంపీలు కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఇదంతా సానుకూలమవుతుందని వైసీపీ భావించినా కూడా ప్రత్యేక హోదా విషయంలో అసలు పట్టించుకోవడంలేదు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ పడకేసినా నిమ్మకుండా ఉంది. విభజన హామీలు కూడా అలాగే ఉన్నాయి.

మరి ఇక్కడ లోపం ఎవరిదీ, ఎందుకు కేంద్రం ఏపీ మీద శీతకన్ను వేసింది అన్నది కూడా విశ్లేషించుకోవాలి. ఏపీలో బీజేపీకి రాజకీయ బలం లేదు కాబట్టే అలా చేసింది అనుకుంటే తమిళనాడులో కూడా బీజేపీకి అసలు బలం లేదు, కానీ అక్కడ వారు కోరినవన్నీ తెచ్చుకుంటున్నారు కదా. అలాగే పశ్చిమ బెంగాల్ లో కూడా అన్ని పనులూ చేస్తున్నారు కదా. ఒడిషాలో కూడా కేంద్రం అభివృద్ధి అపలేదు సరికదా విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలలో ఒడిషా వారికే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది కదా.

దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే విడిగా ఉంటూ రాజకీయంగా కొట్టుకుంటూ ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ఉంటే కేంద్రం అసలు పట్టించుకోదూ అని. అదే విధంగా తమ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు, జగన్ కలవకుండా ఏపీలో ఘర్షణ పడుతూ ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాలని చూస్తే హోదా మాత్రమే కాదు, కేంద్రం నుంచి ఏదీ కూడా రాదు. మరి ఇది అందరికీ అర్ధమైనా కూడా ఏపీలో రాజకీయం మాత్రం ఎపుడూ ఇంతే. అందుకే ఏ సీఎం ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారో లెక్కలు చెప్పుకుంటూనే టైమ్ పాస్ చేయాల్సిందే.