Begin typing your search above and press return to search.

‘ఆది’ ఝలక్ లపై జగన్ కోటరీ హేపీ!

By:  Tupaki Desk   |   17 Feb 2018 2:30 AM GMT
‘ఆది’ ఝలక్ లపై జగన్ కోటరీ హేపీ!
X
తమ గుండెల మీద ఉన్న కుంపటి.. తమ ప్రయత్నం లేకుండానే మరొకరి గుండెల మీదకి వెళ్లిపోతే.. ఎవరికైనా ఎలా ఉంటుంది? ఎంతో ఉపశమనం కలుగుతుంది. హేపీగా అనిపిస్తుంది. హమ్మయ్య విముక్తి దొరికిందిరా బాబూ.. అని ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన జగన్ కోటరీ సన్నిహితులు కూడా ఇదే హేపీనెస్ లో పండగ చేసుకుంటున్నారట. తమ పార్టీ గుర్తు మీద గెలిచి.. అధికార పార్టీ తెలుగుదేశంలోకి వెళ్లిన వారందరి మీద వారు గుర్రుగానే ఉన్నారు గానీ.. ఒక్క నేత విషయంలో మాత్రం.. హమ్మయ్య అనుకుంటున్నారట. తెదేపాలోకి వెళ్లి మంత్రి వైభోగం దక్కించుకున్నప్పటికీ.. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డిని చూసి అసూయ పడకుండా.. ఆయన పాలక పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు కు ఇస్తున్న ఝలక్ లను చూసుకి.. పొంగిపోతున్నారట.

అవును మరి.. మంత్రి ఆదినారాయణ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకున పెట్టడమూ ఇంచుమించుగా బజార్న పెట్టడమూ ఇది తొలిసారి కాదు. పాపం చంద్రబాబు చాలా ప్లాన్ చేసి.. వ్యూహాత్మకంగా రహస్యంగా మెయింటైన్ చేస్తూ.. మార్చి 5న కేంద్రానికి మద్దతు ఉపసంహరించాలని తలపోస్తే.. దాన్ని కాస్త బయటకు వెల్లడించేసి.. వ్యూహంలో ఉండే సీరియస్ నెస్ ను మంత్రి ఆదినారాయణరెడ్డి మంట గలిపేశారు. దీంతో బాబు కోటరీ ఆత్మరక్షణలో పడింది.

వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నంత కాలమూ.. జగన్ అంటే లక్ష్యం లేకుండా విమర్శిస్తూ.. ఎడాపెడా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ చికాకు పెడుతూ వచ్చిన ఆదినారాయణరెడ్డి - తమను వీడిపోయి చంద్రబాబు కోటరీలో చేరడంతో.. ప్రశాంతంగా ఉన్నదని వారు అనుకుంటున్నారు. ఆది నోటి దూకుడు ఎఫెక్టులు - చిక్కులు చికాకులు అన్నీ ఇప్పుడు చంద్రబాబు భరించాల్సిందే కదా.. ఆ రకంగా ఆది తమకు మేలే చేస్తున్నాడని వైకాపా నాయకులు జోకులు వేసుకుంటున్నారు.

ఇదొక్క ఘటనే కాదు. గతంలో పెన్షనర్ల ఎంపిక గురించి చంద్రబాబు సీరియస్ గా చర్చిస్తోంటే.. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా మొత్తం అధికారులకు అప్పగిద్దాం అని వ్యాఖ్యానించినా.. చంద్రన్న బీమా గురించి.. చంద్రబాబుతోనే ఈ పథకం సూపర్ మచ్చీ అంటూ కితాబులిచ్చినా ఆయనకే చెల్లింది. ఇవన్నీ సీఎంను చికాకు పెట్టిన అంశాలే. పథకాల్లో పార్టీ ప్రమేయాన్ని కోరుకుంటూ ఉంటే.. ఆయన దానికి గండిపెట్టేలా అంతా అధికార్ల చేతిలోపెట్టాలనడం ఇదంతా ఇబ్బందికరం అని ఆయన తలపట్టుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయిట. తాము విపక్షంలో ఉన్నా చంద్రబాబుకు అంతగా తలనొప్పి సృష్టించలేకపోతున్నాం అని.. ఆ పనిని ఆదినారాయణ రెడ్డి చాలా బాగా చేస్తున్నారని జగన్ కోటరీ వారు సెటైర్లు వేసుకుంటున్నారట.