Begin typing your search above and press return to search.

దాడిని జగన్ నమ్ముతారా? వైసీపీలోనే ఉంటారా?

By:  Tupaki Desk   |   9 March 2019 2:30 PM GMT
దాడిని జగన్ నమ్ముతారా? వైసీపీలోనే ఉంటారా?
X
జనాలను తాము ఏమార్చగలమని రాజకీయ నేతలు అనుకుంటారేమో కానీ..జనం ప్రతీదీ గమనిస్తూనే ఉంటారు. ఎవరి అవకాశవాదం ఏమిటో జనాల జ్ఞాపకశక్తి నుంచి మాయం అయ్యేది కాదు. ఏ మాత్రం విలువల్లేకుండా తయారైన రాజకీయాల్లో ఎమ్మెల్యేలే పార్టీలు మారి పదవులు, కాంట్రాక్టులు పొందడాన్ని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గత ఐదేళ్లలో ఈ రాజకీయం పతాక స్థాయికి చేరిపోయింది. ఈ సారి ఇలాంటి ఫిరాయింపుదారులను, అవకాశవాదాలను జనాలు చాచి కొట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

అందుకే చంద్రబాబు కూడా చాలా మంది ఫిరాయింపుదారులకు టికెట్లను కేటాయించడం లేదు. ఎందుకంటే జనాగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అని భయం. ఎమ్మెల్యేలుగా ఫిరాయించిన వారు ఒక తీరు అయితే దాడి వీరభద్రరావు లాంటి వారు మరో తీరు. వీళ్లు గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున దాడి రత్నాకర్ పోటీ చేసి ఓడిపోయారు.

అంతే.. ఎన్నికల తర్వాత వీళ్లు మళ్లీ జగన్ ను తిట్టడం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల ముందు జగన్ ను తిట్టారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాల్లో జగన్ ను విమర్శించడం మొదలు పెట్టారు. దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్ ఇద్దరూ ఆ పని చేశారు. చంద్రబాబును మెప్పించి ఎమ్మెల్సీ పదవిని పొందే ప్రయత్నంలో అలా చేశారనే మాట వినిపించింది.

కట్ చేస్తే .. ఇప్పుడు దాడి తండ్రీ కొడుకులు వైసీపీలోకి మళ్లీ చేరిపోయారు. వీళ్లు ఇలా ఎన్నిసార్లు అటూ ఇటూ గెంతుతారు? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అందులోనూ దాడి ఔట్ డేటెడ్ పొలిటీసియన్. గత ఎన్నికలతోనే అది రుజువు అయ్యింది.

ఈ విషయాలు ఏవీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తెలియనవి కావు అని.. పార్టీలోకి వస్తామని వారు వర్తమానం పంపడంతో జగన్ వారిని చేర్చుకున్నారని.. టికెట్లు మాత్రం దక్కే అవకాశాలు లేవనే మాట వినిపిస్తూ ఉంది. దాడి చిరకాల ప్రత్యర్థి కొణతాల తెలుగుదేశంలోకి వెళ్లారు. ఆయన కూడా అటూ ఇటూ గెంతుతున్న వ్యక్తే. చేసేది లేక రాజకీయ ఉనికి కోసం దాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చేరారు.

జగన్ కూడా కొణతాల టీడీపీ చేరిక గురించి బ్యాలెన్స్ చేసేందుకే చేర్చుకున్నారని టాక్. వీరికి టికెట్ దక్కేదేమీ ఉండదని ప్రచారం జరుగుతూ ఉంది. విశాఖ ప్రాంతం పూర్తిగా నగర వాతావరణం. అలాంటి చోట విద్యావంతులు, యువత పట్ల ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాడి, కొణతాల లాంటి వాళ్లు పోటీ చేసినా ప్రజల తిరస్కరణ ఖాయమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.