Begin typing your search above and press return to search.

తీర్పు ఎఫెక్ట్ : రూట్ మ్యాప్ మారుతుందా?

By:  Tupaki Desk   |   23 Oct 2017 3:38 PM GMT
తీర్పు ఎఫెక్ట్ : రూట్ మ్యాప్ మారుతుందా?
X
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయదలచుకున్న పాదయాత్రకు ఇది తొలి విఘ్నం మాత్రమే. ఆయన ఆశించిన తరహాలో కాకుండా.. కోర్టు - వాయిదాలకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వలేం అంటూ తెగేసి చెప్పింది. ఇప్పుడిక జగన్ వ్యూహకర్తలు ‘కిం కర్తవ్యం’ అనే ఆలోచనలో పడ్డారు. కోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా యాత్రను సాగించాల్సిందే అని ముందే నిర్ణయించుకున్నారు గనుక.. అన్ని రకాల ప్రత్యామ్నాయాలకు వారు సిద్ధపడే ఉన్నారు. అయితే తాజాగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి... జగన్ పాదయాత్రకు తొలుత సిద్ధం చేసిన రూట్ మ్యాప్ మారుతుందని ప్రచారం జరుగుతోంది.

జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీన తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం వెళ్తారనేది ప్రస్తుతానికి షెడ్యూలు. 27వ తేదీన శుక్రవారం గనుక కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. 26న వైసీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున ఎలాంటి పోరాటపటిమను అనుసరించాలో ఆ సమావేశంలో వ్యూహరచన చేస్తారు. అంటే 28 నాటికి ఆయన తిరుమలకు వెళ్తారు. తర్వాత నవంబరు 2న ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఇక్కడిదాకా పాదయాత్రలో మార్పులేదు. కాకపోతే ప్రతి శుక్రవారమూ ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

పాదయాత్ర మొదలయ్యేదే గురువారం. ఇడుపులపాయలో ఆరోజు బయల్దేరవచ్చు గానీ.. మరురోజు 3వ తేదీ ఉదయానికెల్లా హైదరాబాదులో కోర్టులో ఉండాలి. అంటే అనుకున్నట్టుగా యాత్ర చిత్తూరు జిల్లా వైపు ఏకబిగిన సాగడం కాకుండా.. 2వ తేదీ సాయంత్రం వరకు ఎక్కడి దాకా నడవగలిగితే.. అక్కడివరకు వెళ్లి, హైదరాబాదుకు బయల్దేరుతారు. 3 వతేదీ కోర్టు వ్యవహారం ముగిసిన తర్వాత.. మళ్లీ అదే పాయింట్ కు చేరుకుని యాత్రను కొనసాగిస్తారు. ఈ క్రమంలో పాదయాత్ర షెడ్యూలు – రూట్ మ్యాప్ లో అనేకానేక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తున్నది.

జగన్ వీలైనంత వరకు రైలు ప్రయాణాలను మాత్రమే ఎంచుకుంటారు. దానికి తగినట్లుగా ప్రతి గురువారం సాయంత్రం సమయానికి.. హైదరాబాదు వెళ్లే రైలు అందుబాటులో ఉండే ఊరికి ఆయన చేరుకునేలా రూట్ మ్యాప్ ను రీడిజైన్ చేస్తారని తెలుస్తోంది. శుక్రవారం నాటికి హైదరాబాదు రావడానికి అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే సందర్భంలో ప్రత్యమ్నాయ మార్గాలు కూడా ఎంచుకుంటారని అంతా అనుకుంటున్నారు.