Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో హెలీకాప్ట‌ర్ ఓ భాగం

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:14 PM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో హెలీకాప్ట‌ర్ ఓ భాగం
X
న‌వంబ‌ర్ 2 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని సీబీఐ కోర్టుకు విన్నివించిన‌ప్ప‌టికీ వైసీపీ అధినేత జగన్‌ కు చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర కార‌ణంగా అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌తి శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కాలేద‌ని జ‌గ‌న్ చేసిన విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చుతూ 6 నెల‌ల పాటు మినహాయింపు ఇస్తే కేసు విచారణ ఆలస్యమవుతుందని సీబీఐ - ఈడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.

సీబీఐ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ జ‌గ‌న్ హైకోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌రోవైపు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను సైతం అన్వేషిస్తున్న‌ట్లు స‌మాచారం. పాద‌యాత్ర ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొన‌సాగుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌గు ఏర్పాట్ల‌ను పార్టీ వ‌ర్గాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు హెలీకాప్ట‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గాన ప్ర‌యాణించ‌డం - తిరిగి యాత్ర‌కు చేరుకోవ‌డం క‌ష్టసాధ్యం - ఇబ్బందిక‌ర‌మైన నేప‌థ్యంలో..యాత్ర కొన‌సాగుతున్న సంబంధిత ప్రాంతం నుంచి హెలీకాప్ట‌ర్ స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని వైసీపీ నేత‌లు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. అవ‌కాశం కుదిరిన చోట విమానం - వీలుకాని చోట హెలీకాప్ట‌ర్‌ తో ఈ యాత్ర‌ను కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ సైతం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు కోర్టు తీర్పుకు లోబడే జగన్ పాదయాత్ర జరుగుతుందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ జగన్ వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసిందన్నారు. అప్పీలుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. జగన్ పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని - ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకుంటార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.