Begin typing your search above and press return to search.

అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ నిజం-జగన్

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:53 AM GMT
అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ నిజం-జగన్
X
అమరావతి రాజధాని పరిధిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని అమరావతిలో వస్తోందని టీడీపీ నేతలకు ముందే చెప్పడంతో వాళ్లు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రైతుల నుంచి బలవంతంగా ఈ భూములు తీసుకున్నారని అన్నారు. రాజధాని ఇక్కడ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పినా.. వినిపించుకోలేదన్న జగన్.. రాజధాని ప్రాంతం ఉన్న గ్రామాలు విజయవాడ-గుంటూరు నగరాలకు కనీసం 30 కిలోమీటర్లుంటుందని.. ఇలాంటి చోట టీడీపీ నేతలు భూములెందుకు కొన్నారని జగన్ ప్రశ్నించారు.

మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఈ రోజు ఏపీ చరిత్రలో సుదినం అని.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో వద్దంటూ శివరామకృష్ణన్ మాట్లాడిన వీడియోను సభలో జగన్ ప్రదర్శించారు. తాత్కాలిక అసెంబ్లీకి రావాలంటే ఒక వాహనం పోవాలంటే తప్ప.. మరో వాహనం రాని పరిస్థితి నెలకొందనే ఫోటోను కూడా జగన్ చూపించారు. రాజధాని కోసం 5 లక్షల కోట్ల ఖర్చుచేస్తామన్న బాబు సర్కారు.. గత ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని జగన్ విమర్శించారు.

అమరావతిలో రాజధాని అంచనా వ్యయం లక్షా 9 వేల కోట్లని.. అంత ఖర్చు పెట్టి రాజధానిని నిర్మించే స్థితిలో రాష్ట్రం లేదని..ఈ రాజధాని కోసం లక్ష కోట్లు పెట్టడం కన్నా విశాఖకు రాజధానిని మారిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని జగన్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2.57 లక్షల కోట్లకు చేరిందని సీఎం గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో చేసిందేమీ లేదని - అప్పులే మిగిల్చారని జగన్ విమర్శించారు. కార్పొరేషన్లకు రూ.57 వేల కోట్ల బకాయి చెల్సించాల్సి ఉందని.. గత ప్రభుత్వం దిగిపోతూ వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చింది ఇదని.. దీంతో పాటు వివిధ సంస్థలకు రూ.39 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలకు కూడా బకాయిలు చెల్లించలేదన్నారు. ఐతే అప్పులున్నాయని ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని.. వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ అన్నారు.