Begin typing your search above and press return to search.

మద్యనిషేదం దిశగా..జగన్ తొలి అడుగే అదిరింది

By:  Tupaki Desk   |   1 Oct 2019 3:55 PM GMT
మద్యనిషేదం దిశగా..జగన్ తొలి అడుగే అదిరింది
X
తాను అధికారంలోకి వస్తే... ఏపీలో మద్యపాన నిషేదాన్ని అమలు చేసి తీరతానని - అందుకోసం దశలవారీగా చర్యలు చేపడతానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా తొలి అడుగు వేసేశారు. ఈ అడుగే సంచలనంగా మారిపోగా... రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో మద్య నిషేదం జరిగి తీరుతుందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్య నిషేదంపై మాట్లాడిన జగన్... అక్టోబర్ 1 న రాష్ట్రంలో మద్యపాన నిషేదం దిశగా తొలి అడుగు వేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాట మేరకే... జగన్ మంగళవారం ఆ తొలి అడుగు వేసేశారు. రాష్ట్రంలో ఇకపై మద్యం విక్రయాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి పెట్టేశారు.

ఇదిలా ఉంటే... నిన్నటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులుంటే... మంగళవారం నుంచి వాటి సంఖ్యను 3500లకు తగ్గించేశారు. ఈ షాపులన్నీ కూడా ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వమే కొత్తగా 11,533 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకుంది. మద్యపానంపై జనానికి విరక్తి కలిగేలా జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. మద్యం ధరలను భారీగా పెంచేసిన జగన్ సర్కారు మద్యాన్ని కొనాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేసిందని చెప్పాలి. దేశీయ మద్యం - విదేశీ మద్యంతో పాటు బీర్లు - వైన్ - రెడీమేడ్ డ్రింక్ లపై సగటున రూ.10 నుంచి రూ.250 వరకు ధరలను పెంచారు. ఈ పెంపునకు కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటూ పేరు పెట్టారు. ఈ పెంచిన ధరలతో 60 ఎంఎల్ మద్యం ధర కూడా రూ.10 మేర పెరగనుండటంతో మద్యం ప్రియులు నిజంగానే మద్యపానానికి దూరం జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

ఇక కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం విక్రయాల సమయాన్ని కూడా భారీగా తగ్గించేశారు. నిన్నటిదాకా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మద్యం దొరికితే... మంగళవారం నుంచి ఉదయం 11 గంటలకు తెచరుకునే సర్కారీ మద్యం షాపులు రాత్రి 8 గంట కొట్టగానే మూతబడిపోతున్నాయి. దీంతో గతంలో కంటే ఏకంగా 3 గంటల పాటు మద్యం విక్రయాల సమాయాన్ని తగ్గించినట్టైందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఇప్పటిదాకా గుడి - బడి - జాతీయ రహదారికి సమీపంలో వైన్ షాపులు ఉండరాదన్న నియమం ఉన్నా... వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాలు సాగితే... ఇప్పుడు మాత్రం గుడి - బడితో పాటు జాతీయ రహదారిపై మద్యం షాపులు కనిపించడానికి వీల్లేదని జగన్ సర్కారు తెగేసి చెప్పేసింది. అంతేకాకుండా... ఏదేనీ ప్రాంతంలో మద్యం షాపు వద్దని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు కోరితే... అక్కడి షాపును ఎత్తివేసే దిశగానూ వేగంగానే చర్యలు తీసుకునే దిశగానూ జగన్ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది.