Begin typing your search above and press return to search.

పార్టీలో జ‌గ‌న్ మెచ్చే ఆ ఒక్క‌రు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   20 Jan 2017 5:37 AM GMT
పార్టీలో జ‌గ‌న్ మెచ్చే ఆ ఒక్క‌రు ఎవ‌రు?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌ధాన విప‌క్ష‌మైన వైసీపీలో ఇపుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెచ్చే ఆ ఒక్క‌రు ఎవ‌రు అనేది ఈ చ‌ర్చ‌ల సారాంశం. ఒక్క‌రినే ఎందుకు మెచ్చుతారు అనే సందేహానికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఉంది. శాసనసభ్యుల కోటా నుంచి శాసన మండలికి జరిగే ఎన్నికల్లో వైసీపీకి ఒకే ఒక్క స్థానం దక్కనుంది. అయితే ఈ ఒక్క ఎమ్మెల్సీ సీటుపై ఏకైక విపక్షం వైసీపీలో పోటీ పెరుగుతోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు పార్టీ అధినేత జగన్ వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చిన నేతలు కూడా అభ్యర్థిత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

వ‌చ్చే మార్చిలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి దక్కనున్న ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కనుందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి - సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కె పార్థసారథి - అదే జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ - గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు - చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి - ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పేర్లు చర్చల్లో నలుగుతున్నాయి. వీరిలో ధర్మానకు సీటు ఇస్తే ఉత్తరాంధ్రలో బీసీ వెలమల్లో పట్టుపెరుగుతుందని అంటున్నారు. పైగా మండలిలో సీనియర్లు లేనందున ధర్మాన ఉంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారంటున్నారు. అలాగే జగన్ సమీప బంధువైన బాలినేనికి గతంలోనే ఎమ్మెల్సీ సీటుపై హామీ ఇచ్చారని, ఆయనకు సీటు ఇస్తే ప్రకాశంలో పార్టీ బలపడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. కాపు ఉద్యమంలో తెర వెనుక ఉండి కీలకపాత్ర పోషిస్తోన్న జగన్ సన్నిహితుడు కరుణాకర్‌ రెడ్డికీ దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక కాపు నేత - పార్టీ పక్షాన మొదటి నుంచీ అధికార పార్టీపై దాడికి నాయకత్వం వహిస్తోన్న అంబటికి జరిగిన అన్యాయాన్ని ఈసారి సరిదిద్దే అవకాశాలున్నాయనీ వినిపిస్తోంది. అయితే గతంలో అదే వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి అవకాశం ఇచ్చినందున మళ్లీ అదే వర్గానికి ఇస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు - మాజీ మంత్రి పార్థసారథికి ఇస్తే యాదవులు పార్టీ వైపు ఆకర్షితులవుతారన్న వాదన వినిపిస్తోంది. కాగా అదే జిల్లాకు చెందిన అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఇప్పటివరకూ జరిగిన అన్యాయాన్ని ఈసారి సరిదిద్దుతారన్న చర్చ జరుగుతోంది. చాలాకాలం నుంచి ఆమె బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని, ఆమెకు గతంలో అవకాశమొచ్చినా వేరే కారణాల వల్ల గోవిందరెడ్డికి ఇవ్వాల్సి వచ్చిందని - ఆమేరకు ఆమెకు జగన్ హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. తనకు సీటు రాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకూ మహిళకు అవకాశం ఇవ్వనుందున ఈసారికి కచ్చితంగా ఎమ్మె ల్సీ సీటు దక్కవచ్చంటున్నారు. అదేవిధంగా జగన్ సమీప బంధువైన బాలినేనికి గతంలోనే జగన్ హామీ ఇచ్చారంటున్నారు. బాలినేని అసంతృప్తితో కొంతకాలం పార్టీకి దూరంగా ఉండి తెదేపాలో చేరుతున్నారన్న సమయంలో బుజ్జగించి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేముందు ఎమ్మెల్సీ కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలినేనికి ఇవ్వకపోతే ఈసారి తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు. అయితే గతంలో కాపులకు అవకాశం ఇచ్చినందున ఈసారి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా పార్టీలో వినిపిస్తోంది. మొత్తంగా వివిధ స‌మీక‌ర‌ణాల‌ను లెక్క‌లోకి తీసుకొని జ‌గ‌న్ మెచ్చే ఆ ఒక్క‌రు ఎవ‌ర‌నే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లోనే సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/