Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేస్తున్నారేంటి జ‌గ‌న్‌?

By:  Tupaki Desk   |   4 Jun 2019 3:59 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేస్తున్నారేంటి జ‌గ‌న్‌?
X
కొన్నిసార్లు ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ చూపించే ప్ర‌భావం అద్భుతంగా ఉంటుంది. దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చారిత్ర‌క విజ‌యంగా చెప్పాలి. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లాలో పర్య‌టించిన సంద‌ర్భంగా ఆ జిల్లా వాసులు మ‌ర్చిపోలేని హామీని ఇచ్చి మ‌న‌సు దోచుకున్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

తాను ముఖ్య‌మంత్రి అయ్యాక కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. మాట త‌ప్ప‌ని.. మ‌డ‌మ తిప్ప‌ని వంశం అంటూ త‌ర‌చూ చెప్పుకునే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట మీద చాలామంది ఈ హామీ మీద ఆశ‌లు పెట్టుకున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడైన ఎన్టీఆర్ పేరును ఆయ‌న పుట్టిన కృష్ణా జిల్లాకు పెట్టాల‌న్న ఆలోచ‌న బాబు స‌ర్కారుకు రాకున్నా.. జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. హామీ ఇవ్వ‌టం చ‌ర్చ‌గా మారింది.

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ స‌ర్కారు ఏపీలో కొలువు తీరింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి నాలుగు రోజులే అయినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఊహించ‌నంత వేగంతో పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్.. ప‌లు ప‌థ‌కాల‌కు పేర్లు మార్చేయ‌టం.. త‌న తండ్రి పేరు వ‌చ్చేలా పెట్టేయ‌టం చేస్తున్నారు.

అన్న క్యాంటీన్ల‌కు రాజ‌న్న క్యాంటీన్లుగా.. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ప‌థ‌కాలకు పేరు మార్చేయాల‌న్న ఆలోచ‌న చేస్తున్నారు జ‌గ‌న్‌. ఇలా ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ప‌థ‌కాల పేర్లు మార్చేస్తున్న‌ జ‌గ‌న్‌.. తాను ఇచ్చిన హామీని అమ‌లు చేసే అవ‌కాశం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఆయ‌న పేరు మీద ఉన్న ప‌థ‌కాల పేర్ల‌ను తీసేయ‌టం స‌రైన‌దేనా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌న్న హామీ.. రాజ‌కీయంగా ల‌బ్థి చేకూరేందుకు అంతో ఇంతో సాయం చేసింది స‌రే.. ఆ మైలేజీకి భిన్నంగా జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఉండ‌టం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తోంది.