Begin typing your search above and press return to search.

అంబానీ మ‌నిషికి సీటెందుకు..జ‌గ‌న్ పార్టీ లెక్క ఇదే!

By:  Tupaki Desk   |   9 March 2020 11:30 PM GMT
అంబానీ మ‌నిషికి సీటెందుకు..జ‌గ‌న్ పార్టీ లెక్క ఇదే!
X
ఊహించిందే జ‌రిగింది! రాజ్య‌స‌భ ఎన్నిక‌ల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి అంద‌రి అంచ‌నాల‌ను నిజం చేశారు!! త‌న‌ను న‌మ్ముకున్న వారికి - త‌న వెంట న‌డిచిన వారికే కాకుండా....త‌న‌కు `అవ‌స‌రం` ఉన్న వారికి, త‌న‌ను `గుర్తించిన` వారికి ఆయ‌న పెద్ద‌ల స‌భ‌లో సీటు క‌ట్ట‌బెట్టారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా మంత్రులు మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ - రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి - మ‌రో సీటును మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ న‌మ్మినబంటు అయిన‌ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి - మంత్రి బొత్స సత్యనారాయణ - మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ మేర‌కు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌పై త‌మ అభ్య‌ర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేప‌థ్యంలో పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి పార్టీ నేత‌లంద‌రితో చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. మొత్తం సీట్ల‌లో 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామ‌ని అన్నారు. ఈ ప్రాతిప‌దిక‌న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు రాజ్యసభ సీటు క‌ట్ట‌బెట్టామ‌ని తెలిపారు. పార్టీ శ్రేయోభిలాషిగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ స్థానం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నాలుగో సీటును వ్యాపారవేత్త‌ పరిమల్ నత్వాని ఇవ్వనున్నామ‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు.

వ్యాపారవేత్త‌ పరిమల్ నత్వానికి సీటు ఇవ్వ‌డం వెనుక కార‌ణాల‌ను వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. భార‌తదేశ‌ వ్యాపార దిగ్గ‌జం ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి ఆయనకు అవ‌కాశం ఇవ్వడం జరిగిందని నేత‌లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పరిశ్రమల అబివృద్ధికి కృషి చేస్తామని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారని వైసీపీ నేత‌లు తెలిపారు. కాగా, ఇటీవ‌లే రిల‌యన్స్ దిగ్గ‌జం ముఖేష్ అంబానీ స్వ‌యంగా తాడేప‌ల్లికి విచ్చేసి సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఆయ‌న వెంట‌న ప‌రిమ‌ళ్ సైతం ఉన్నారు. అప్పుడే ఆయ‌న‌కు సీటు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త‌ద్వారా దేశ రాజ‌కీయాల్లో ముఖ్యంగా బీజేపీతో అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో తేడా కొట్ట‌కుండా ఉండేందుకు జ‌గ‌న్ అవ‌కాశాలు తెరిచి ఉంచుకున్నార‌ని విశ్లేషిస్తున్నారు. కాగా, మోపిదేవి - సుభాష్ చంద్రబోస్ లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరిని రాజ్యసభకు పంపుతున్నారు.