Begin typing your search above and press return to search.

వంశీ వర్సెస్ యార్లగడ్డ.. జగన్ ఓటెవరికి?

By:  Tupaki Desk   |   27 Oct 2019 7:57 AM GMT
వంశీ వర్సెస్ యార్లగడ్డ.. జగన్ ఓటెవరికి?
X
గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ తాజాగా సీఎం జగన్ ను కలవడం.. వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వంశీ మోహన్ ను ఆహ్వానిస్తున్న జగన్ కు ఇప్పుడు అదే గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరడాన్ని గన్నవరం వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న యార్ల గడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. గత టీడీపీ ప్రభుత్వంలో తనపై, దాదాపు 4వేల మంది వైసీపీ నేతలపై ఇదే వంశీమోహన్ కేసులు పెట్టి వేధించాడని.. ఆయనిప్పుడు వైసీపీలో చేరితే పార్టీ కేడర్ మనోనిబ్బరం కోల్పోతుందని యార్లగడ్డ స్పష్టం చేస్తున్నారు.

అయితే జగన్ నిబంధనల ప్రకారం వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే వైసీపీలో చేరాల్సి ఉంటుంది. దీనికి వంశీ కూడా సరేననట్లు తెలిసింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన కార్యకర్తలతో కలిసి వంశీని చేర్చుకోవద్దని వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నాడు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

వంశీ వైసీపీలో చేరికను వ్యతిరేకిస్తూ యార్లగడ్డ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా వంశీ కూడా కార్యకర్తలతో విడిగా సమావేశం అవుతూ వైసీపీలో చేరికపై చర్చలు జరుపుతున్నారు. యార్లగడ్డ వ్యతిరేకతపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో యార్లగడ్డ వ్యతిరేకిస్తున్న వంశీని జగన్ చేర్చుకుంటారా? జగన్ ఓటు ఎవరికి అనేది త్వరలోనే తేలనుంది.