Begin typing your search above and press return to search.

మా చిన్నాన్న‌ది హ‌త్యే!..జ‌గ‌న్ ఏమ‌న్నారంటే?

By:  Tupaki Desk   |   15 March 2019 4:19 PM GMT
మా చిన్నాన్న‌ది హ‌త్యే!..జ‌గ‌న్ ఏమ‌న్నారంటే?
X
దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి సోద‌రుడు - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం ఇప్పుడు రాష్ట్రంలో పెను క‌ల‌క‌లం రేపుతోంది. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా ప‌క‌డ్బందీగా జ‌రిగిన ఈ దారుణ హ‌త్య వైఎస్ ఫ్యామిలీతో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానుల‌ను తీవ్రంగా క‌లచివేసింది. ఈ వార్త తెలిసిన వెంట‌నే... ఎన్నిక‌లకు సంబంధించి ముమ్మ‌ర క‌స‌ర‌త్తులో ఉన్న వైఎస్ జ‌గ‌న్‌... వెనువెంట‌నే త‌న సొంతూరు పులివెందులకు బ‌య‌లుదేరారు. చిన్నాన్న మృత‌దేహాన్ని చూసి ఆయ‌న శోక‌సంద్రంలో కూరుకుపోయారు. ఆ త‌ర్వాత అక్క‌డే మీడియాతో మాట్లాడిన ఆయ‌న అత్యంత సౌమ్యుడిగా ఉన్న త‌న చిన్నాన్న‌ను అధికార పార్టీ నేత‌లే హ‌త్య చేశార‌ని ఆరోపించారు. అత్యంత కిరాత‌కంగా జ‌రిగిన ఈ హ‌త్య‌పై నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో ద‌ర్యాప్తు జ‌ర‌పాల్సిందేన‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మీడియాతో ఏం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... *చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరు లేరు. ఆయన చనిపోతూ ఒక లెటర్‌ రాశారని - అందులో డ్రైవర్‌ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యకేసులో చాలామంది ఉన్నారు. బెడ్‌ రూంలో అయిదుసార్లు గొడ్డ‌లితో దాడి చేశారు. తలపై గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. ఆయనను బెడ్‌ రూంలో చంపి బాత్రూమ్‌ వరకూ తీసుకువచ్చారు. ఆ తర్వాత చిన్నాన‍్న రక్తం కక్కుకుని సహజంగా చనిపోయినట్లు చిత్రీకించేందుకు ప్రయత్నించారు. ఆయన రాసినట్లుగా చూపిస్తున్న లేఖ కూడా కల్పితమే* అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

త‌న కుటుంబాన్ని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న య‌త్నాల‌ను ఏక‌రువు పెట్టిన జ‌గ‌న్ ఆ వరుస క్ర‌మాన్ని చెప్పుకొచ్చారు. *ఇక మా నాన్నను కట్టడి చేయడం కోసం తాతను చంపారు. తాతను చంపిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇక నాన్న వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదానికి రెండు రోజుల ముందు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు సవాల్‌ చేశారు. ఆ తర్వాత నన్ను విమానాశ్రయంలో చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్‌ వేస్తే ఎలా?. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుంది. దయచేసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంయమనం పాటించండి. దేవుడున్నాడు. దోషులను తప్పనిసరిగా శిక్షిస్తాడు* అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.