Begin typing your search above and press return to search.

టఫ్ టాస్క్ తో అక్కడికి ఆమంచి...జగన్ మాట విన్నట్లేనా...?

By:  Tupaki Desk   |   14 Jan 2023 3:30 AM GMT
టఫ్ టాస్క్ తో అక్కడికి ఆమంచి...జగన్ మాట విన్నట్లేనా...?
X
వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరి కంటే ముందుగా నమ్మి 2019 ఎన్నికల వేళ ఆ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్. ఆయన తనతో పాటు మరికొందరిని చేర్పించారు. అలా ఊపు వచ్చిన తరువాత మిగిలిన వారు ఇతర నాయకులు సినీ నటులు కూడా వైసీపీకి క్యూ కట్టారు మొత్తానికి వైసీపీకి సక్సెస్ కళ కట్టింది. అలా ఆమంచి బోణీ మంచిదైంది. వైసీపీ పవర్ లోకి వచ్చింది.

కానీ ఆమంచి మాత్రం చీరాలలో ఓడిపోయారు. దీంతో ఆయనకు గత నాలుగేళ్ళుగా ఏ రకమైన పదవి లేదు. చీరాలలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు వెంకటేష్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. దాంతో ఉన్న చోటుని వదులుకుని మరీ ఆమంచి జగన్ డైరెక్షన్ లో పర్చూరు కి షిఫ్ట్ అయ్యారు.

ఆ మధ్య దాకా ఆమంచి పర్చూరుకి వెళ్ళరని, చీరాలలోనే తేల్చుకుంటారని వార్తలు వినిపించాయి. అవసరం అయితే ఆయన పార్టీ మారుతారు అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆమంచి మంచిగానే పర్చూరు బాట పట్టారు. ఇపుడు ఆయన తనది కాని చోట యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారన్న మాట. పర్చూరు అంటే ప్రకాశం జిల్లాలో అందరికీ గుర్తుకు వచ్చే ఫ్యామిలీ దగ్గుబాటి వారిది. ఎన్టీయార్ కాలం నుంచి కూడా పెద్దల్లుడు వెంకటేశ్వరరావు పర్చూరు ని అట్టేబెట్టుకుని ఏలుతూ వచ్చారు. అనేక సార్లు ఆయన గెలిచారు.

అంతటి పట్టున్న దగ్గుబాటి కొన్నాళ్ళు రాజకీయంగా సైలెంట్ గా ఉండడంతో ఆయన వర్గం కొంత దెబ్బ తింది. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయారు. ఇక ఆయన రాజకీయాలకే ఇపుడు దూరం అయ్యారు. ఇక పర్చూరు లో తెలుగుదేశానికి కంచుకోటగా మార్చిన వారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. ఆయన జగన్ వేవ్ లో సైతం గెలిచారు అంటే గట్టి పిండంగా చెప్పుకోవాలి.

అలాంటి చోట కంచుకోట లాంటి సీట్లో ఇపుడు ఆమంచిని పంపించారు జగన్. వచ్చే ఎన్నికల్లో ఆమంచి అక్కడ నుంచే పోటీ చేయాలి. తన లక్ ని పరీక్షించుకోవాలి. ఈ రోజు నుంచి యుద్ధం మొదలెడితేనే తప్ప వచ్చే ఎన్నికల్లో నిలబడలేరు, కలబడలేరు. తాజాగా పర్చూరుకు వచ్చిన ఆమంచికి వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున స్వాగతం పలికింది. ఇక రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, వైసీపీ మహిళా ప్రెసిడెంట్ పోతుల సునీత వంటి వారు ఆయనతో భేటీ అయ్యారు.

మొత్తానికి చూస్తే తెలుగుదేశం జోరు మీద ఉన్న వేళ పర్చూరు లో ఆమంచి ఎంతవరకూ ఫ్యాన్ రెక్కలను గిర్రున తిప్పించగలరు అన్నది పెద్ద డౌట్. మరో వైపు మందీ మార్భలం పుష్కలంగా ఉన్న ఏలూరి సాంబశివరావుని ఓడించడం కంటే కష్టమే అంటున్నారు. అయితే ఆమంచికి బలం ఏంటి అంటే సామాజికవర్గం. అలాగే వైసీపీ సంక్షేమ పధకాలు.

ఈ రోజు నుంచి ఆయన గడపగడపకూ తిరిగి పార్టీని పరుగులు పెట్టించాల్సి ఉంది. కమ్మ క్యాండిడేట్ మీద కాపుని పోటీకి పెట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ తో ఓడించాలని జగన్ చూస్తున్నారు. అలా ఆమంచికి రిస్కీ టాస్క్ ఇచ్చేశారు. మరి పర్చూరు లో ఆమంచి ఏ రకమైన మ్యాజిక్ చేయబోతున్నారు ఆయన ఆలోచనలు ఏంటి అన్నది తొందరలొనే తెలుస్తాయి అంటున్నారు. తాను ఏరి కోరి ఆమంచిని పంపించారు కాబట్టి జగన్ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.