Begin typing your search above and press return to search.

ఆయనొస్తే జగన్ కు రచ్చ మొదలైనట్లే

By:  Tupaki Desk   |   8 Dec 2015 7:18 AM GMT
ఆయనొస్తే జగన్ కు రచ్చ మొదలైనట్లే
X
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపలేకపోతున్న వైసీపీ వేస్తున్న అడుగులు విమర్శకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వివాదాస్పద నాయకులకు అడ్డాగా మారిన వైసీపీ ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మరో వివాదాస్పదుడిని పార్టీలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బలమైన నేతలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ, ఫేడవుట్ అయిపోయిన వారు, వివాదాస్పదులను తీసుకోవడం వల్ల నష్టమే తప్ప కొత్తగా వచ్చే ప్రయోజనమేమీ ఉండదని విమర్శకులు అంటున్నారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూను వైసీపీలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై వైసీపీలోనే విమర్శలొస్తున్నాయి. ఆయన రాక వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో కానీ ఆయన్ను వ్యతిరేకించే వర్గం వారంతా పార్టీని వీడడం ఖాయమని వినిపిస్తోంది.

విజయవాడలో దేవినేని నెహ్రూను ఎలాగైనా చేర్చుకోవాల‌ని వైసీపీ నేత‌లు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయన్ను చేర్చుకుంటే కీలకమైన ఆ సామాజిక వర్గం అండ కొంతవరకు సంపాదించవచ్చని భావిస్తున్నారు. కానీ... అదేసమయంలో కాపు సామాజికవర్గం నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వారిని దూరం చేసుకోవాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. నెహ్రూ వ్యతిరేకులు ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు పంపిస్తున్నారు. ఆయన వైకాపాలోకి వ‌స్తే తాము పార్టీని వీడుతామని చెప్తున్నారు. నెహ్రూతో శతృత్వం ఉన్న వంగ‌వీటి రాధా ఆయ‌న చేరిక‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజ‌య‌సాయి రెడ్డికి ఆయన ఇప్పటికే ఈ విషయం చెప్పేశారని... నెహ్రూ వస్తే ఒక్క నిమిషం కూడా పార్టీలో ఉండబోనని రాధాకృష్ణ చెప్పారని సమాచారం. నెహ్రూ చేరికకు ఏర్పాట్లన్నీ వేగంగా జరిగిపోతున్న తరుణంలో ఇది విజయవాడ వైసీపీలో కుల చిచ్చుగా మారుతుందని విమర్శకులు అంటున్నారు. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.